డీ శ్రీనివాస్ కుమారుడు సంజ‌య్‌ పై నిర్భ‌య కేసు

Update: 2018-08-03 15:52 GMT
రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ తమను లైగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థినులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేసిన ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. నిజామాబాద్‌లోని శాంకరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తమను సంజయ్ కొద్దిరోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. బాధిత విద్యార్థినులు వారి తల్లిదండ్రులు - పీవోడబ్ల్యూ సంధ్యతో కలిసి గురువారం సచివాలయంలోని చాంబర్‌లో హోంమంత్రిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు. ఈ ఫిర్యాదు పై నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో డి. శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్‌ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. నర్సింగ్ విద్యార్థినుల ఫిర్యాదుతో సంజయ్‌పై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి - డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాలేజీలో చేరిన కొంతకాలానికే మహిళా ప్రిన్సిపాల్‌ను మాన్పించారని, నాటినుంచి తమను కాలేజీ హాస్టళ్లకు రావాలని సంజయ్ ఒత్తిడి తెచ్చేవాడని విద్యార్థినులు ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 26న ఓ విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లి దుస్తులు తొలిగించాలని బలవంతం చేశాడని, అసభ్య పదజాలంతో బెదిరించాడని, మరో విద్యార్థినిని గదిలో బంధించాడని వివరించారు. చర్యలు తీసుకోవాలని డీజీపీకి నాయిని సూచించారు. 342 - 354 - 506 - 354ఎ(నిర్భయ చట్టం) కింద సంజయ్‌పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సంజయ్‌ను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా.. ఇంట్లో లేరు. దీంతో ధర్మపురి సంజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా, హోంమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత విద్యార్థినులతో కలిసి పీవోడబ్ల్యూ సంధ్య సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్‌లో ధర్మపురి సంజయ్‌కు చెందిన శాంకరీ నర్సింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థినులు ఉండగా, 11 మందిని లైంగికంగా వేధించినట్టు తెలిపారు. కాలేజీకి వస్తూ అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడేవాడని ఆరోపించారు. సంజయ్ వేధింపులు భరించలేక విద్యార్థినులు మూడు హాస్టళ్లను ఖాళీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
Tags:    

Similar News