ఆ కడుపు కోత మరే తల్లికి వద్దు

Update: 2015-12-21 09:07 GMT
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు.. కళ్ల ముందు నరకయాతన అనుభవించి మరణిస్తే.. అంతకు మించిన కడుపు కోత ఏముంటుంది? తనకేమాత్రం పాపం తెలీకున్నా.. దారుణంగా హింసిస్తూ.. అత్యాచారం చేసిన పశువుల చేతికి చిక్కిన చిట్టితల్లి బతకాలని ఉందన్నా ఎవరూ ఏమీ చేయలేక.. పోయే ప్రాణాల్ని ఆపలేక నిస్సహయులుగా చూస్తూ ఉండిపోయారు. వైద్యశాస్త్రానికి సవాలు విసిరే సమస్యలతో పోతున్న ప్రాణాల్ని ఎవరూ ఆపలేరు. కానీ.. చట్టంలోని లొసుగుల కారణంగా దారుణమైన తప్పు చేసిన వ్యక్తిని వదిలేయటం ఏమిటన్నదే ప్రశ్న.

నేరం చేయటానికి అడ్డురాని చిన్న వయసు.. ఆ నేరానికి పాల్పడిన వారికి శిక్ష విధించటంలో ‘‘చిన్న వయసు’’ను పరిగణలోకి తీసుకోవటం ఏమిటో అర్థం కాదు. ఎప్పుడో బీసీ కాలాల్లో తయారు చేసిన చట్టాల్ని డిజిటల్ యుగంలోనూ మార్చకపోవటం ఏమిటి? ఒక అసాధారణ నేరం జరిగినప్పుడు.. దానికి తగ్గట్లుగా శిక్షలు విధించేలా చట్టాలు ఎందుకు మార్చకూడదు. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు కళ్ల ముందే కాలర్ ఎగిరేస్తూ తిరుగుతుంటే ఏ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోగలరు? కూతురు పోయిన వేదన నుంచి ఇంకా బయటకు రాక ముందు.. అందుకు కారణమైన వ్యక్తి మాత్రం దర్జాగా బయటకు రావటం చూసినప్పుడు.. ఇలాంటి కడుపుకోత మరే తల్లికి రాకూడదని అనుకోవటం తప్పేం కాదేమో.
Tags:    

Similar News