పిల్ల పిశాచాలు రెండు మాట్లాడుకుంటున్నాయట

Update: 2015-10-01 08:53 GMT

నిర్భయ ఉదంతాన్ని దేశ ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. పారా మెడికల్ విద్యార్థినిని అత్యంత క్రూరంగా హింసించి.. సామూహిక అత్యాచారం చేసిన ఉదంతంలో మైనర్ బాలుడు ఒకడు ఉండటం తెలిసిందే. నిజానికి ఈ వికృతకాండలో అత్యంత దారుణంగా వ్యవహరించిన వారిలో సదరు మైనరు పాత్రే ఎక్కువ. అయితే.. మైనర్ అన్న ఒకే ఒక్క కారణంతో అతడికి పరిమిత కాలం పాటు బాలల సంరక్షణ శాలలో ఉంచాలని శిక్ష విధించారు. ఇతగాడు ఈ డిసెంబరు 21న విడుదల కావాల్సింది ఉంది. నేరం చేసే నాటికి పిల్ల పిశాచిగా ఉన్న వీడి ప్రస్తుత వయసు 20 ఏళ్లు.

ప్రస్తుతం మజ్నూకా తిలాలోని జువైనల్ హోంలో ఉన్న ఇతగాడికి మరో తీవ్రవాద పిల్ల పిశాచి పరిచయం అయ్యాడట. అఫ్జల్ గురును ఉరి తీసిన తర్వాత.. కోర్టులను బాంబులతో పేల్చేస్తానంటూ మొయిళ్లు పంపిన ఇతగాడిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. మైనర్ అన్న కారణంతో ఇతన్ని జువైనల్ హోంలో ఉంచారు.

ఈ ఇద్దరు పిల్ల పిశాచుల మధ్య మాటలు కలిశాయని.. నిర్భయ హంతకుడ్ని ఉగ్రవాదం వైపునకు ఆకర్షించేలా ప్రయత్నాలు జరిగినట్లుగా చెబుతున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాద కార్యకలాపాల మీద ప్రస్తుతం జువైనల్ హోంలో ఉన్న పిల్ల పిశాచి.. నిర్భయ పిల్ల పిశాచిని ఆకర్షించి.. వాడి మైండ్ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. వీరిద్దరూ కలవకుండా జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి.. పిల్ల పిశాచులుగా ఉంటూ దారుణమైన నేరాలకు పాల్పడిన వారిద్దరూ విడుదలై.. సమాజంలోకి అడుగు పెడితే..?

Tags:    

Similar News