సీత‌మ్మ ర‌గిలిపోయిందే.. రీజ‌నేంట‌బ్బా!

Update: 2022-10-12 14:07 GMT
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌.. తాజాగా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల‌పై.. తీ వ్రస్తాయిలో విరుచుకుప‌డ్డారు. ఆయా దేశాలు తీసుకుంటున్న నిర్ణ‌యాల కార‌ణంగా... అనేక ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని.. దీనికి ఆయా దేశాలే బాధ్య‌త వ‌హించాల‌ని.. నిప్పులు చెరిగారు.

ఆయా దేశాలు తీసుకుం టున్న రాజకీయ, ఆర్థిక విధానాల వల్ల అంతర్జాతీయంగా ఎదురవుతున్న పర్యవసానాలకు అవే బాధ్యత వహించాలన్నారు. విపరీత విధానాల వల్ల విపరీత మార్కెట్ ప్రతిస్పందనకు బాటలు పడుతున్నాయని, ఈ విధానాలతో ఎలాంటి సంబంధం లేని దేశాలు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.

అస‌లు ఏం జ‌రిగింది?

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు నిర్మల సీతారామన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలో, బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో, ఆర్థికవేత్త ఈశ్వర్ ప్రసాద్‌తో  ఆమె మాట్లాడారు. ప్రజల పట్ల కర్త్యవాన్ని నిర్వహించే దేశాలపై అభివృద్ధి చెందిన దేశాలు ఆంక్షలు విధించడానికి బదులుగా రక్షణ కవచాలను ఏర్పాటు చేయాలన్నారు.

వాతావరణ మార్పుల కట్టడి కోసం కృషి చేసినందుకు, ఇంధన పరివర్తనకు అయిన ఖర్చులను భర్తీ చేయడంపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.  అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం పడకుండా ఉండటానికి భారత దేశంతో సహా ఏ దేశమూ మినహాయింపు కాదని పేర్కొన్నారు.

క‌రోనా అనంత‌రం.. యూరప్‌లో యుద్ధం(ర‌ష్యా-ఉక్రెయిన్‌) వచ్చిందని సీత‌మ్మ తెలిపారు. ఈ ప్రభావం ఇంధనం, ఎరువులు, ఆహార ధాన్యాలు, పదార్థాలపై పడిందన్నారు. ఈ నేపథ్యంలో సింక్రనైజ్డ్ గ్లోబల్ మానెటరీ పాలసీ కఠినతరం అయిందన్నారు. సహజంగానే భారత దేశం సహా చాలా దేశాల వృద్ధి అంచనాలను సవరించి, తగ్గించారన్నారు.

వృద్ధి, ద్రవ్యోల్బణాలను ఈ ట్రిపుల్ షాక్ రెండు వైపులా పదునుగల కత్తి గా మార్చిందని చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ వృద్ధి రేటు అంచనాను తగ్గించినప్పటికీ, భారత దేశం 7 శాతం వృద్ధితో దూసుకెళ్తుందన్న నమ్మకం తనకు ఉందని సీత‌మ్మ చెప్పారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News