ఒక్కమాట.. అందులోనూ కోట్లాది మంది టీవీలో లైవ్ చూస్తున్న వేళ.. నేతల నోటి నుంచి వచ్చే మాటలకు ఉండే విలువ వేరు. నిజం చెప్పినా? అబద్ధం చెప్పినా టేకిట్ గ్రాంటెడ్ అన్నట్లు ఉంటుంది. అవినీతి మచ్చ లేకుండా సాగుతున్న మోడీ సర్కారుపై మొదటిసారి భారీ ఎత్తున ఆరోపనలు రావటం తెలిసిందే.
ఈ ఇష్యూపై బీజేపీ వ్యతిరేకుల మాటల్లో చెప్పాలంటే.. ఇది 30 ఏళ్ల క్రితం రాజీవ్ ప్రభుత్వాన్ని ముంచేసిన బోఫోర్సు కుంభకోణం లాంటిదని.. బీజేపీ బోఫోర్స్ గా అభివర్ణిస్తున్నారు. మోడీ సర్కారుపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో తేడా జరిగిందన్న మాటను చెప్పారు.
ఇటీవల కాలంలో అతి పెద్ద డీల్ గా అభివర్ణిస్తున్న ఈ డీల్ కు సంబంధించిన కీలకమైన యుద్ధ విమానాల కొనుగోలు ధరల్ని వెల్లడించకపోవటం గోప్యత ఒప్పందంలోని భాగమని.. అందులో భాగంగానే తాము ధరల్ని వెల్లడించలేదని చెప్పారు దేశ రక్షణ శాఖా మంత్రి నిర్వలా సీతారామన్. తెలుగింటి కోడలుగా సుప్రసిద్ధమైన ఆమె మాటలకు తిరుగు ఉండదని చెబుతారు. బీజేపీకి పెట్టని కోటలా ఉండే నిర్మలమ్మ నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ అడ్డంగా బుక్ అయినట్లు చెబుతున్నారు.
కేంద్ర రక్షణ శాఖామంత్రి హోదాలో ఉన్న నిర్మలమ్మ మాట్లాడుతూ.. రాఫెల్ యుద్ధ విమానాల ధరల్ని బయటకు పెట్టకపోవటం ఒప్పందంలో భాగమని.. ఆ ఒప్పందాన్ని చేసింది 2008లోని యూపీఏ సర్కారుగా వెల్లడించారు. ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ కు ప్రధాన అస్త్రంగా మారనున్నట్లు తెలుస్తోంది.
దీనికి తగ్గట్లే యూపీఏ హయాంలో మాజీ రక్షణ మంత్రిగా వ్యవహరించిన ఏకే ఆంటోనీ రంగంలోకి దిగారు. నీతికి.. నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపంగా ఉండే ఆయన నోటి నుంచి నిర్మలమ్మ అబద్ధం చెబుతున్నారన్న మాట బయటకువచ్చింది. నిర్మలమ్మ చెబుతున్నట్లుగా రాఫెల్ యుద్ధ విమానల విషయంలో గోపత్యా ఒప్పందంలో ఎలాంటి నిజం లేదని.. నిర్మలమ్మ చేసిన వాదన తప్పని తేలినట్లుగా చెప్పారు.
నిండు సభలో.. అసత్యపు మాటలు చెప్పిన నిర్మలా సీతారామన్ పై సభాహక్కుల ఉల్లంఘన పెట్టనున్నట్లుగా చెబుతున్నారు. మరికొందరి విశ్లేషణను చూస్తే.. కాంగ్రెస్ పన్నిన ఉచ్చులో వీరావేశంతో స్పందించిన కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పడినట్లుగా భావిస్తున్నారు. ధరల వెల్లడి విషయంలో గోపత్య ఒప్పందం లేదన్న విషయాన్ని బయటపెట్టిన ఏకే ఆంటోని మాటలు ఇప్పుడు మోడీ సర్కారును ధర్మ సంకటంలో పడేలా చేసినట్లు చెప్పక తప్పదు.
ఓపక్క ధరల విషయాన్ని ఒప్పందంలో భాగంగా బయటపెట్టకూడదని నిర్మల చెబుతుంటే.. అలాంటిదేమీ లేదన్న మాజీ రక్షణ మంత్రి మాటలు మోడీ సర్కారును ఇరుకున పడేసేలా చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. 2008లోని యూపీఏ సర్కారు ఒప్పందం చేసుకున్న వ్యాఖ్యలోనూ తప్పు ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఆంటోనీ చేసిన వ్యాఖ్యల్లో కీలకాంశాలు చూస్తే..
1. అసలు 2008లో రాఫెల్ విమానాల కొనుగోలుకు ఎలాంటి ఒప్పందం కుదర్లేదు
2. 2008 నాటికి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు జాబితాను ఎంపిక చేయలేదు
3. భారత్‌కు యుద్ధ విమానాలు అమ్మేందుకు రెండు అమెరికన్ కంపెనీలు.. ఒక రష్యన్.. స్వీడన్.. యూరప్ కంపెనీతో పాటు.. ఫ్రాన్స్ కు చెందిన దసాల్డ్ కంపెనీ పోటీకి వచ్చింది
4. 2012లోనే దసాల్డ్ కంపెనీతో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు చేసేందుకు నిర్ణయానికి వచ్చాం.
5. ధరలపై చర్చలు ముగిశాయి. కొన్ని అంశాలు పరిష్కారం కాకపోవటంతో ఒప్పందంపై సంతకం చేయలేదు
6. భారత - ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందం గురించి నేను 2008లోనే పార్లమెంటులో చెప్పా
7. రక్షణ ఉత్పత్తుల ధరల్ని సభలో వెల్లడించకపోవటం వెనుక గోపత్యా నిబంధన ఉందన్నది తప్పు
8. ఏ దేశం నుంచి అయినా కొనుగోలు చేస్తే దాన్ని కాగ్ ఆడిట్ చేస్తుంది. ఒప్పందం తాలూకు పత్రాలను ధరలను పరిశీలిస్తుంది. పార్లమెంటుకు సంబంధించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ధరల్ని సమీక్షిస్తుంది. ఇంత జరిగిన తర్వాత ధరల విషయంలో గోప్యత ఎక్కడిది?