నిర్మ‌ల ఎంట్రీతో 'డిఫెన్స్' ప‌టిష్ట‌మే!

Update: 2017-09-12 06:41 GMT
బీజేపీ సీనియ‌ర్ నేత‌గానే కాకుండా ఆ పార్టీలో మ‌హిళా నేత‌ల్లో స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌గా పేరు తెచ్చుకున్న కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి అరుదైన ఘ‌న‌తనే సంపాదించారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి మ‌హిళ‌గా రికార్డుల‌కు ఎక్కిన నిర్మ‌ల‌.. త‌న‌దైన వ‌ర్కింగ్ స్టైల్‌ తో ఆ శాఖ‌ను మ‌రింత ప‌టిష్టంగా మార్చేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ముందుకు సాగుతున్నారు. న‌రేంద్ర మోదీ స‌ర్కారులో తొలుత వాణిజ్య శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నిర్మ‌ల‌... ఆ శాఖ వ్య‌వ‌హారాల్లో త‌న‌దైన ముద్ర వేశార‌నే చెప్పాలి. అదే స‌మ‌యంలో ప‌నితీరులో క్లీన్ ఇమేజ్‌ తో ముందుకు సాగిన ఆమె... మోదీ కేబినెట్‌ కే వ‌న్నె తెచ్చార‌నే చెప్పాలి.

జీఎస్టీ ప‌న్నుల విధానానికి కార్య‌రంగం సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో విప‌క్షాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌ధాని మోదీ - సీనియ‌ర్ మినిస్ట‌ర్‌ అరుణ్ జైట్లీ - నాడు మ‌రో కీల‌క మంత్రిగా ఉన్న ఇప్ప‌టి భార‌త ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు నాన్ స్టాప్ చ‌ర్చ‌ల‌కు తెర తీయ‌గా... తెర వెనుకే ఉన్న నిర్మ‌ల మాత్రం ప‌న్నుల ప్ర‌భావంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న వ‌ర్త‌క‌ - వాణిజ్య వ‌ర్గాలు మ‌రింత‌గా బెంబేలెత్త‌కుండా ఉండేలా చేయ‌డంలో స‌ఫ‌లీకృత‌మ‌య్యార‌నే చెప్పాలి. జీఎస్టీ స్మూత్ ర‌న్ విష‌యంలో నిర్మ‌ల చాలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని సాక్షాత్తు అధికార వ‌ర్గాలే చెప్పుకున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇదంతా గ‌త‌మైతే... నిర్మ‌ల ప‌నితీరును మెచ్చిన మోదీ... మొన్న‌టి కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఆమెకు త‌న కేబినెట్‌ లోనే కీల‌క‌మైన ర‌క్ష‌ణ శాఖ‌ను అప్ప‌గించారు. ఏ ఒక్క‌రూ ఊహించ‌ని ఈ ప‌రిణామంతో మోదీ స‌ర్కారు ఓ చ‌రిత్ర‌నే రాసింద‌ని చెప్పాలి.

అప్ప‌టిదాకా ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా కొన‌సాగిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఇటీవ‌లే ఆ శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నిర్మ‌ల త‌న‌దైన రీతిలో సైలెంట్‌ గానే ప‌నిచేసుకుపోతున్నారు. ర‌క్ష‌ణ శాఖ వ్య‌వ‌హారాల్లో నిర్మ‌ల ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో, అనుకున్నంత మేర రాణిస్తారో?  లేదోన‌న్న అనుమానాలు ఏ ఒక్క‌రికీ లేకున్నా... ఓ మ‌హిళ‌గా ఆ బాధ‌ఠ్య‌త‌ల‌ను ఏ త‌ర‌హాలో నిర్వ‌హిస్తార‌న్న ఆస‌క్తి మాత్రం ఉంది. ఇవేవీ ప‌ట్ట‌ని నిర్మ‌ల మాత్రం త‌న‌దైన మార్కు పాల‌న‌తో ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టిదాకా ర‌క్ష‌ణ రంగంలోని త్రివిధ ద‌ళాల్లో మ‌హిళ‌ల‌కు కొంత‌మేర మాత్ర‌మే ఎంట్రీ ద‌క్క‌గా... స‌ద‌రు ఎంట్రీని అన్ని విభాగాల‌కు విస్త‌రిస్తూ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే నిర్మ‌ల కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా ర‌క్ష‌ణ శాఖ‌ను మ‌రింత దుర్బేధ్యంగా మ‌లచే క్ర‌మంలో ఆ శాఖ‌పై రోజువారీ స‌మీక్ష‌కు ఆమె సిద్ధ‌మైపోయారు.

మునుపెన్న‌డూ లేని విధంగా ఇప్పుడు ప్ర‌తి రోజు ఉద‌యం త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో నిర్మ‌ల స‌మావేశం కానున్నారు. ఈ భేటీ ముగియ‌గానే... ర‌క్ష‌ణ శాఖ కార్య‌ద‌ర్శితోనూ ఆమె నిత్యం భేటీ అవుతార‌ట‌. ఇక ర‌క్ష‌ణ శాఖ కొనుగోళ్ల‌కు ఎలాంటి ఆటంకం జ‌ర‌గ‌కుండా ఉండ‌టంతో పాటు కొనుగోళ్ల‌లో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌కుండా... స‌ద‌రు వ్య‌వ‌హారాలు చూసే క‌మిటీతో నిర్మ‌ల ప్ర‌తి 15 రోజుల‌కు ఓసారి పూర్తి స్థాయి స‌మీక్ష చేస్తార‌ట‌. ఈ త‌ర‌హాలో ముందుకు సాగ‌నున్న నిర్మ‌ల‌... ర‌క్ష‌ణ శాఖ‌ను మునుపెన్న‌డూ లేని విధంగా శ‌త్రు దుర్బేధ్యంగా మార్చ‌డ‌మే కాకుండా... ఇత‌ర శాఖ‌ల ప్ర‌భావం ఆ శాఖ‌పై ప‌డ‌కుండా చూస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News