శ్మశాన వాటికలకు జీఎస్టీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన నిర్మలమ్మ!

Update: 2022-08-03 04:25 GMT
శ్మశాన వాటికలకు జీఎస్టీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన నిర్మలమ్మ!
  • whatsapp icon
సోషల్ మీడియా.. వాట్సాప్ ల కారణంగా కొన్ని అంశాలు అదే పనిగా వైరల్ అవుతుంటాయి. అందులో నిజమా? అబద్ధమా? లాంటి కనీస అంశాల్ని సైతం క్రాస్ చెక్ చేసుకోకుండా షేర్ చేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో జీఎస్టీకి సంబంధించి కొత్త వస్తుసేవల్ని పన్ను పోటు పరిధిలోకి తీసుకొచ్చిన వేళ.. ప్రభుత్వం ప్రకటించిన సరికొత్త జీఎస్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అన్నింటికి మించిన శ్మశాన వాటికలపై పన్ను పోటు పడినట్లుగా ప్రచారం జరిగింది.

ఇందులో నిజానిజాల్ని చాలామంది అస్సలు పట్టించుకోలేదు. మోడీ సర్కారు మీద తమకున్న ఆగ్రహానికి శ్మశాన వాటికలకు జీఎస్టీ వేశారన్న వార్తను పుట్టించారు. తమకున్న కోపాన్ని కసిగా తీర్చుకుంటూ ఈ తప్పుడు వార్తను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావటంపై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా ధరల పెంపుపై పార్లమెంటులో విపక్షాలు విరుచుకు పడ్డాయి. దీనిపై బదులిచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధపు ప్రచారాన్ని కొట్టి పారేశారు.

తమ ప్రభుత్వం శ్మశానవాటికలకు జీఎస్టీ లేదన్నారు. కొత్త శ్మశాన వాటికల నిర్మాణం పై మాత్రం పన్ను ఉంటుందని ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో.. శ్మశాన వాటికపై జీఎస్టీ పన్ను ఉందన్న వాదనలో ఏ మాత్రం నిజం లేదన్న విషయం తేలింది. ఇక.. బ్యాంకులు ఇచ్చే చెక్కుబుక్కులకు వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేయరని క్లారిటీ ఇచ్చారు. మరి.. బ్యాంకుల్లో చెక్కు బుక్కులపై విధించిన జీఎస్టీపై తాజాగా మరింత స్పష్టత ఇచ్చిందని చెప్పాలి.

బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి చెక్కుబుక్ లకు జీఎస్టీ వేయరని చెప్పిన నిర్మలమ్మ.. సదరు బ్యాంకులకు చెక్కు బుక్కులు సప్లై చేసే వారు ఉంటారు కదా? వారికి జీఎస్టీ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలపై ఎలాంటి పన్ను భారాన్ని వేయలేదని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే.. మన దేశంలో ద్రవ్యోల్బణం కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

కేంద్రం చేసిన ప్రయత్నాలతోనే భారత్ లో ద్రవ్యోల్బణం రేటు 7 శాతంగా ఉంది. ధరలు పెరిగాయన్నది ఎవరూ కాదనలేని అంశం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్రం తన వంతు సాయాన్ని అందించినట్లుగా పేర్కొన్నారు. ఆసుపత్రుల పడకలు.. ఐసీయూ కేంద్రంగా పేర్కొనే జీఎస్టీ మీద ఆమె మరింత స్పష్టతను ఇస్తూ.. ఆసుపత్రి పడకలు.. ఐసీయూలకు ఎలాంటి జీఎస్టీ లేదన్నారు.

ఆసుపత్రి పడకలకు.. ఐసీయూలకు జీఎస్టీ లేదన్న ఆమె.. రోజుకు రూ.5వేలు దాటి వసూలు చేసే అద్దె గదులకు మాత్రం జీఎస్టీ విధించామని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేర్.. అపోలో.. కిమ్స్.. ఇలా పేరున్న ఆసుపత్రులే కాదు.. ఒక మోస్తరు ఆసుపత్రుల్లోనూ రోజుకు రూ.5వేల చొప్పున వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఒక మోస్తరు హోటళ్లకు వెళ్లే వారంతా పన్ను పోటుకు సిద్ధమవ్వాలన్న విషయాన్ని నిర్మలమ్మ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News