నారాయ‌ణ కొడుకు అతివేగం..మూడు సార్లు జ‌రిమానా

Update: 2017-05-10 13:48 GMT
ఏపీ మంత్రి నారాయ‌ణ త‌న‌యుడు నిశిత్ దుర్మ‌ర‌ణంలో అనూహ్య‌మైన అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ(23) జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో మెట్రో పిల్లర్‌కు తన కారును ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో నిశిత్‌తో పాటు అతని స్నేహితుడు రవి వర్మ(23) కూడా మృతి చెందాడు. బెంజ్ కారు(టీఎస్07 ఎఫ్‌కే 7117) వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో కాస్తంత ఎత్తుకు ఎగిరిన కారు వేగంగా అదేస్థాయిలో వెనక్కి వచ్చింది.

అయితే నిశిత్ అతివేగంతో కారు న‌డ‌ప‌డం ఇదే మొద‌టిసారి కాద‌ని పోలీస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మ‌ధ్య కాలంలోనే మూడు సంద‌ర్భాల్లో ఓవ‌ర్ స్పీడ్‌తో నిశిత్ వెల్లిన‌ట్లు పోలీసులు తెలిపారు. తొలిసారి జనవరి 24, 2017న గండిపేట వద్ద 150కి.మీ వేగంతో కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ కెమెరాలకు చిక్కాడు. మరోసారి మార్చి1న గండిపేట వద్దే అతివేగంతో కారు నడుపుతూ నిషిత్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఆ త‌ర్వాత ప‌ది రోజుల‌కే అంటే మార్చి 10న మూడోసారి ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కి జరిమానా చెల్లించాడని పోలీసులు వెల్ల‌డించారు.

ఇక తాజా ఘ‌ట‌న విష‌యానికి వ‌స్తే... నిశిత్‌ను బలిగొన్న‌ది మామూలు స్పీడ్ కాదు. హై ఎండ్ కారు కూడా ఆ స్పీడ్ కు తుక్కుతుక్కు కాక తప్పలేదు. ఓ కర్వ్ దగ్గర మెర్సిడీజ్ ను ఎంత స్పీడ్ గా డ్రైవ్ చేశాడో వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిన బెంజ్ ఆ ధాటికి పూర్తిగా దెబ్బతింది. బెంజ్ దూసుకు వస్తున్న వేగాన్ని పోలీసులు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫూటేజ్ లో చూడ‌వచ్చు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాన్ని కాపాడే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆ స్పీడ్ ధాటికి పనిచేయలేకపోయాయి. పిల్లర్ ను ఢీకొన్న తర్వాత మెర్సిడీజ్ వెనక్క వచ్చిన తీరు కూడా ఆ ప్రమాదం తీవ్రతను వివరిస్తుంది.

కాగా, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  నిశిత్ మృతిపట్ల ముఖ్యమంత్రులు చంద్ర‌బాబు, కేసీఆర్ సంతాపం తెలిపారు. నిశిత్ మృతిపట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయడు స్పందిస్తూ.. మంత్రి నారాయణ కుమారుడు అతిని స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధ కలిగించిందన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి నారాయణ కుటుంబ సభ్యులను అపోలో హాస్పిటల్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్, ఇతర నేతలు పరామర్శించారు. కాగా, ఈ దుర్ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఏపీ మంత్రి నారాయణకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నిశిత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
Tags:    

Similar News