అమ్మ కోసం నీతూ అంబానీ వచ్చి వెళ్లారు

Update: 2016-10-14 05:22 GMT
అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్న వేళ..  ప్రముఖుల పరామర్శలు పెరుగుతున్నాయి. అమ్మ ఆరోగ్యం ఇప్పుడెలా ఉందన్న ప్రశ్నకు అధికారికంగా సమాధానం దొరకనప్పటికీ.. అనధికారికంగా మాత్రం పలు సమాధానాలు దొరికే పరిస్థితి. ఇందులో నిజం ఏమిటి? అబద్ధమేమిటి? అన్నది ఎవరికి వారుగా తెలుసుకోవాల్సిన దుస్థితి. అమ్మ ఆరోగ్యంపై కోట్లాది మంది ఆత్రుత కనపరుస్తున్నా.. వారి భావోద్వేగాల్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అధికారిక సమాచారం లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒక ప్రముఖ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. కోట్లాది మంది సదరు నేత ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కోసం నిరీక్షిస్తున్నప్పుడు.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించటం ద్వారా లేనిపోని వదంతులు వ్యాపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వీలు ఉంటుంది. కానీ.. అలాంటిదేమీ జరగటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా అమ్మ ఆరోగ్యానికి సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అమ్మ ఆరోగ్యం కుదుట పడిందని.. ఆమెకు అమర్చిన వెంటిలేటర్లను తీసివేసినట్లుగా చెబుతున్నారు. గడిచిన మూడు రోజులుగా అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి బులిటెన్లు విడుదల కాకపోవటం గమనార్హం. తాజాగా వెంటిలేటర్ ను తొలిగించిన నేపథ్యంలో.. ఆమెను మరో రెండు రోజుల్లో ప్రత్యేక గదికి తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అమ్మ ఆరోగ్యాన్ని.. ఆమెకు చేస్తున్న వైద్యాన్ని పర్యవేక్షించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు ఖిల్నానీ వచ్చారు. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులైన ఆయన.. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక సలహాలు సూచనలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే చెన్నైలోనే ఉండి.. తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు. ఇక.. అపోలో ఆసుపత్రిలు యజమాని డాక్టర్ సి. ప్రతాపరెడ్డి ఆసుపత్రిలోనే ఉండి.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. అమ్మను పరామర్శించేందుకు వీవీఐపీలు వస్తున్నారు. గురువారం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతూ అంబానీ అపోలో ఆసుపత్రికి వచ్చారు. అమ్మకు జరుగుతున్న వైద్యం.. ఆమెకు చేస్తున్న చికిత్స వివరాల్ని అడిగి తెలుసుకున్న ఆమె.. ‘అమ్మ’ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ రోజు తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అమ్మను పరామర్శించేందుకు వస్తున్నట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News