గడ్కరీ సంచలన వ్యాఖ్యలు.. ల్యాబ్ లోనే పుట్టింది

Update: 2020-05-14 03:30 GMT
ప్రపంచాన్ని చుట్టేసిన మాయదారి రోగం మూలాలు ఏమిటన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా పలు వాదనలు వినిపిస్తుంటాయి. ఇది సహజసిద్ధమైనదని కొందరంటే.. కాదు.. కాదు.. వూహాన్ ల్యాబులో పుట్టిందని తేల్చేస్తారు. ఇందులో నిజం ఏమిటన్న విషయంపై కిందామీదా పడుతున్న పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇది ల్యాబులో పుట్టిందన్న సందేహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

ప్రపంచం సంగతి ఎలా ఉన్నా.. మన దేశంలో.. అందునా అధికారపక్షానికి చెందిన కీలక నేతల నోటి నుంచి రాని విధంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న ఈ మాయదారి రోగం నేచురల్ ఎంతమాత్రం కాదని.. ల్యాబుల్లో పుట్టిందన్నారు. ‘ఇలాంటివేళ.. ఎలా జీవించాలో నేర్చుకోవాలి. ఇది సహజంగా వచ్చిన వైరస్ కాదు. ఇది ల్యాబులో తయారైంది. కృత్రిమమైన దీంతో ఎలా బతకాలన్నది ముఖ్యం. ప్రపంచంలో దీనికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం చాలానే దేశాలు శ్రమిస్తున్నాయి. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం’ అని వ్యాఖ్యానించారు.

ఈ మాయదారి రోగం ఎలా తగులుకుంటుందన్నది గుర్తించే మెథడాలజీ ఇప్పుడు అవసరమైందంటున్నారు. అప్పుడు మాత్రమే దాని జాడల్ని త్వరగా గుర్తించే వీలుందన్నారు. సహజంగా వచ్చి ఉంటే మరోలా ఉండేదని.. కానీ ల్యాబుల్లో పుట్టింది కావటంతోనే.. దీని తీరున ఊహించలేమన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రజల్లో భరోసా నింపొచ్చన్న ఆయన.. ఇప్పుడున్న భయాందోళనలకు చెక్ పడేది ఎప్పుడన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి. దేశంలో మరే నేత చేయని రీతిలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనలకు దారి తీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News