గ‌డ్క‌రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మోడీషాల‌ పై తొలి తిరుగుబాటు

Update: 2018-12-26 04:42 GMT
తోపుగా చెప్పుకునే మీడియానే అన్ని మూసుకొని మోడీ పై విమ‌ర్శ‌లు చేసేందుకు వెన‌క్కి తగ్గుతున్న వేళ‌.. మోడీ టీంలో కీల‌క నేత‌గా.. కేబినెట్‌ లో ప్రాధాన్య‌త ఉన్న శాఖ‌ను నిర్వ‌హిస్తున్న కేంద్ర మంత్రి ఒక‌రు మోడీని.. ఆయ‌న నీడ‌లాంటి అమిత్ షాను విమ‌ర్శించటం సాధ్య‌మేనా? అంటే కాదంటాం. కానీ.. తాజాగా అదే జ‌రిగింది. అసాధ్యం అనుకున్న‌ది సుసాధ్యం కావ‌ట‌మే కాదు.. మోడీషాల‌ పై తొలిసారి బ‌హిరంగంగా విమ‌ర్శ‌ల తూటాలు పేలాయి. వాటిని పేల్చిన మొన‌గాడిగా బీజేపీ మాజీ జాతీయ అధ్య‌క్షుడు.. కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ.
 
ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయిన నేప‌థ్యంలో.. దాని పై బాధ్య‌త వ‌హించ‌టం కానీ.. ఆ ఓట‌మి పై ఆత్మ‌ప‌రిశీల‌న చేయ‌టం లాంటివేమీ చేయ‌ని మోడీషాల తీరును ఆయ‌న తాజాగా విమ‌ర్శించారు. సూటి వ్యాఖ్య‌లు కాకున్నా.. ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. విన్నంత‌నే మోడీషాల‌ను గ‌డ్క‌రీ వేసుకున్న వైనం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌టం తాజా సంచ‌ల‌నంగా మారింది.
సంఘ్ ప‌రివార్ కు చాలా ద‌గ్గ‌రివాడ‌న్న పేరుతో పాటు.. మోడీ త‌ర్వాత ఆయ‌న వార‌సుడిగా పార్టీలో అంతో ఇంతో చ‌ర్చ జ‌రిగే గ‌డ్క‌రీ నోటి నుంచి దిమ్మ తిరిగే రీతిలో మోడీషాల మీద విమ‌ర్శ‌లు రావ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. విమ‌ర్శ‌ల వ‌ర‌కూ ఎందుకు?.. క‌నీసం వేలెత్తి చూపించే సాహ‌సం చేయ‌లేని మోడీషాల మీద వారి వైఫ‌ల్యాల్ని.. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల గురించి గ‌డ్క‌రీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

వేదిక ఏద‌న్న‌ది పాయింట్ కాదు.. చెప్పాల‌నుకున్న‌ది చెప్పేశామా?  లేదా? అన్న రీతిలో గ‌డ్క‌రీ వ్య‌వ‌హారించారు. తాజాగా ఆయ‌న పాల్గొన్న‌ది ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారుల సమావేశం. అందులో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. ఆయ‌న ల‌క్ష్యం మోడీషాలన్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు. ఊహించ‌ని రీతిలో తెర మీద‌కు వ‌చ్చిన గ‌డ్క‌రీ.. ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో అంద‌రి క‌న్ను త‌న మీద ప‌డేలా చేసుకున్నారు. నెహ్రును పొడిగే ప‌నిని అస్స‌లు చేయ‌ని మోడీ తీరుకు భిన్నంగా ఆయ‌న్ను ప్ర‌శంసించ‌టం ఆస‌క్తిక‌రంగా చెప్పాలి. మోడీని ఉద్దేశించి ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు నేరుగా లేన‌ప్ప‌టికీ.. ఆయ‌న మాట‌లు వింటే ఆయ‌న విమ‌ర్శిస్తున్న‌ది ప్ర‌ధానినే అన్న భావ‌న ఇట్టే అర్థ‌మ‌య్యేలా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల్లో కీల‌క‌మైన‌వి కొన్ని చూస్తే..

+  నేను పార్టీ అధ్యక్షుణ్నయినపుడు, నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యే లు సరిగా పనిచేయనపుడు తప్పెవరిది? నాదే కదా!

+  ప్రస్తుతం హోంశాఖ సమర్థంగా పనిచేస్తోందంటే దానికి కారణం సుశిక్షితులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే. వారిలో అనేకమంది సచ్ఛీలురు, తమ పని భేషుగ్గా నిర్వర్తిస్తున్నారు. ఓ పార్టీ విషయంలోనూ అంతే.. వ్యక్తులు సరిగా పని చేయాలి. లేదంటే దానికి నాదే బాధ్యత. వారిని సరిగా తీర్చిదిద్దని తప్పు నాదే అవుతుంది.

+  వ్యవస్థను సరిగా నడపాల్సిన బాధ్యత నాయకుడిదే. కింది వారు సరిగా పనిచేయనపుడు, కోరుకున్న లక్ష్యాలు నెరవేరనపుడు ఆ నాయకుడే దానికి బాధ్యత వహించాలి.

+  భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రసంగాలంటే చాలా ఇష్టం.

+  భారతీయ వ్యవస్థకు పెద్ద ఆభరణం పరమత సహనం. ఒక వ్యక్తి అద్భుతంగా ప్రసంగించినంత మాత్రాన ఓట్లు రాలవు. మీరు విద్వాంసుడే కావొచ్చు. అన్నీ నాకు తెలుసు అనుకుంటే మీరు పొరబడ్డట్లే. కృత్రిమమైన మార్కెటింగ్‌ ఎల్లకాలం నిలవదు.


Tags:    

Similar News