ఇది ట్రైలరేనట.. సినిమా ముందుందట!

Update: 2019-05-05 08:35 GMT
దేశాన్ని ఐదేళ్లు పాలించిన బీజేపీ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈసారి తమదే అధికారమంటూ కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారో పక్కన పెడితే గడిచిన ఐదేళ్ల తమ పాలన ట్రైలర్ మాత్రమే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత - కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ఈసారి గెలిస్తే మాత్రం ప్రజలకు అసలైన సినిమా చూపిస్తారట. దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ భారతదేశ గతిని మార్చలేకపోయిందని - బీజేపీ మాత్రమే దేశాన్ని అభివృద్ధిలో నడిపిస్తుందని అన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని గడ్కరీ వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్లమెంటులో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై ప్రజలకు ఇప్పటికీ విశ్వాసం కలగడం లేదన్నారు. ఈసారి రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదన్నారు.

పేదరిక నిర్మూలన పేరుతో జవహర్‌ లాల్ నెహ్రూ హయాం నుంచే ప్రజలను మోసం చేయడాన్ని కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందన్నారు. రాహుల్ గాంధీ చెబుతున్న ‘న్యాయ్’ పథకం కూడా అటువంటిదేనని తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచ ఉగ్రవాది మసూద్ అజర్ విషయంలో తమ ప్రభుత్వం చూపించిన దౌత్యనీతి వల్లే ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలిచాయని - పాకిస్థాన్‌ ను ఏకాకిని చేయగలిగామని గడ్కరీ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News