తగ్గేదేలే.. మరోసారి కేంద్ర మంత్రి హాట్‌ కామెంట్స్‌!

Update: 2022-11-09 06:31 GMT
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు ఇటీవల కాలంలో హాట్‌ కామెంట్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సొంత పార్టీ బీజేపీని ఇరుకునపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీలోనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ప్రధాని, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు మన్మోహన్‌ సింగ్‌పై నితిన్‌ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినందుకు మన్మోహన్‌ సింగ్‌కు దేశం రుణపడి ఉందని కొనియాడారు. ఈ మేరకు టీఐవోఎల్‌-2022 అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్‌పై అభినందనల జల్లు కురిపించారు.

దేశంలోని పేదలకు ప్రయోజనాలు అందించాలంటే ఉదారవాద ఆర్థిక విధానం అవసరమని నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. 1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా మనోహ్మన్‌ సింగ్‌ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు.. ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు నాంది పలికాయని గడ్కరీ కొనియాడారు. మన్మోహన్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు మన దేశానికి కొత్త దిశానిర్దేశం చేశాయని గుర్తు చేశారు. సరళీకరణ విధానాలతో దేశానికి కొత్త దిశానిర్దేశం చేసిన మన్మోహన్‌ సింగ్‌కు భారత్‌ రుణపడి ఉంది అని కొనియాడారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వల్లే 1990ల మధ్యకాలంలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు నిర్మించడానికి నిధులు సేకరించగలిగానని గుర్తు చేసుకున్నారు. ఏ దేశ అభివృద్ధిలో అయినా ఉదారవాద ఆర్థిక విధానం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఇందుకు చైనా మంచి ఉదాహరణ అని గుర్తు చేశారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి భారత్‌కు మరిన్ని మూలధన నిధులు అవసరమని అభిప్రాయపడ్డారు.

గత కొంత కాలం నితిన్‌ గడ్కరీ.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాలతో పలు అంశాల్లో విభేదిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉండి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ప్రధానిని కొనియాడటంపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

కాగా గతంలోనూ నితిన్‌ గడ్కరీ హాట్‌ కామెంట్స్‌ చేయడం విశేషం. నితిన్‌ గడ్కరీ.. మహారాష్ట్రలోని విదర్బ ప్రాంతంలో బీజేపీలో కీలక నాయకుడు. అందులోనూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఆర్‌ఎస్‌) కేంద్ర కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌కు చెందిన నేత. ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధమూ ఎక్కువే. అన్ని పార్టీల నేతలతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని పదవికి మొదట్లో నరేంద్ర మోడీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నితిన్‌ గడ్కరీ పేరు గట్టిగానే వినిపించింది.

అయితే ప్రస్తుతం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్‌ గడ్కరీని అనూహ్యంగా కొద్దిరోజుల క్రితం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. బీజేపీలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునేది.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అనే విషయం తెలిసిందే. అలాంటిది బీజేపీలో మోడీ, అమిత్‌ షా తర్వాత మూడో స్థానంలో ఉన్న నితిన్‌ గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో తనను బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించిన దగ్గర నుంచి ఆయన హాట్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే ప్రస్తుతమున్న సమస్య అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

అయినా ఆగని నితిన్‌ గడ్కరీ.. బీజేపీ అధికారంలోకి రావడానికి అద్వానీ, వాజపాయి చేసిన కృషే కారణమని ఇటీవల మరోసారి తేల్చిచెప్పారు. ఎక్కడా నరేంద్ర మోడీ ప్రస్తావన తేకపోవడం గమనార్హం. ఈ వ్యాఖ్యలపైన బీజేపీలో కల్లోలం రేగింది. అయినా మరోమారు నితిన్‌ గడ్కరీ హాట్‌ కామెంట్స్‌ చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News