నితిన్ గడ్కరీకి ఏమైంది? ఆయన తరచూ ఎందుకు సిక్ అవుతున్నారు

Update: 2019-08-02 04:22 GMT
మోదీ మొదటి కేబినెట్లో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్టీ - విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మోదీ రెండో సారి గెలిచిన తరువాత మంత్రివర్గంలో లేరు. అందుకు కారణం వారి అనారోగ్యమే. ఇద్దరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో తామే మంత్రి పదవులు వద్దని చెప్పారని బీజేపీ వర్గాలు అప్పట్లోనే చెప్పాయి. ఇప్పుడు మరో మంత్రి నితిన్ గడ్కరీ కూడా తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతుండడంతో బీజేపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ జాతీయ గీతాలాపన సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు - శ్రేణులు షాక్‌ కు గురయ్యారు. అయితే.. చిన్నపాటి సమస్యేనని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

షోలాపూర్ లోని పుష్యలోక్ అహల్యదేవి హోల్కరీ యూనివర్శిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కుర్చీలో కూలబడిపోయారు. వెంటనే ఆయనకు ప్రాథమిక పరీక్షలను నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.

యాంటీబయోటిక్స్ ఓవర్ డోస్ కావడం వల్లే గడ్కరీ ఈ సమస్యకు గురయ్యారని వైద్యులు తేల్చారు. కాగా.. కొద్దికాలంగా గొంతు సంబంధిత వ్యాధితో గడ్కరీ బాధపడుతున్నారు. దీంతో ఆయన యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. వాటి డోస్ ఎక్కువ కావడంతో ఇబ్బంది తలెత్తిందని డాక్టర్లు తెలిపారు. ఇంతకుముందు కూడా గడ్కరీ ఓ కార్యక్రమంలో ఇలాగే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఇప్పుడు మరోసారి అలా జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News