సిద్దూకి గ‌డ్క‌రీ శాపాలు

Update: 2016-09-15 10:48 GMT
పంజాబ్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయం వేడెక్కుతోంది. బీజేపీని వీడిన సిద్ధూ ఆప్ లోకి వెళ్తార‌ని అనుకున్నా కూడా ఆయ‌న అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ కొత్త పార్టీ పెట్టారు. దీంతో పంజాబ్ ఎన్నిక‌ల‌పై భారీ ఆశ‌లు పెట్టుకున్న బీజేపీ మ‌రింత చిక్కుల్లో ప‌డిన‌ట్లయింది. ఇంత‌వ‌ర‌కు ఆప్ ఒక్క‌టే శ‌త్రువు అనుకుంటే ఇప్పుడు సిద్ధూ కూడా త‌మ అవ‌కాశాల‌ను కొల్ల‌గొట్టే ప‌రిస్థితులు క‌నిపిస్తుండ‌డంతో బీజేపీ పెద్ద‌లు సిద్ధూపై విరుచుకుప‌డుతున్నారు. రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డంతో స‌రిపెట్ట‌కుండా శాప‌నార్థాలూ పెడుతున్నారు.

తాజాగా బీజేపీ మాజీ అధ్యక్షుడు - కేంద్ర మంత్రి అయిన నితిన్ గ‌డ్క‌రీ సిద్ధూ పేరెత్త‌కుండా, ఆయ‌న పార్టీ పేరు ప‌ల‌క్కుండానే శాపాలు పెట్టారు.  పంజాబ్‌లో ప్రస్తుతం కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలకు భవిష్యత్తు లేదని గడ్కరీ గురువారం ఆన్నారు.  ఎస్‌ ఎడి-బిజెపి కూటమి మాత్రమే రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతుందని ఆయన చెప్పారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నందున రాష్ట్రంలోకి నిధులు అపారంగా ప్రవహిస్తాయని ఆయన చెప్పారు.

కాగా పంజాబ్ లో ఎలాగైనా అధికారం అందుకోవాల‌ని బీజేపీ చాలాకాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అదే స‌మ‌యంలో ఆప్ నేత కేజ్రీవాల్ కూడా అక్క‌డ క్ర‌మంగా బ‌ల‌ప‌డుతూ గ‌ట్టి పోటీదారుగా మారారు. దీంతో బీజేపీ గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయం ఉంది. అలాంటి క‌ష్ట‌స‌మ‌యంలో ఛ‌రిష్మా గ‌ల నేత సిద్ధూ కూడా బీజేపిని వీడి ఏకంగా కొత్త పార్టీ పెట్ట‌డంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. దీంతో శాపాలు పెట్ట‌డం మొద‌లుపెట్టారు ఆ పార్టీ పెద్ద‌లు. మ‌రి.. బీజేపీ శాపాల‌కు ఉట్లు తెగుతాయో లేదో చూడాలి.
Tags:    

Similar News