అయ్యే ప‌నేనాః ఢిల్లీ టు థాయ్‌ లాండ్ రోడ్డు

Update: 2015-12-21 07:44 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం దేశీయ మౌళిక అవ‌స‌రాల కంటే విదేశాల‌తో సంబంధాల‌కే పెద్ద పీట వేస్తుంద‌నే విష‌యం మరోమారు తేట‌తెల్లం అయింది. మౌళిక స‌దుపాయాల్లో అత్యంత కీల‌క‌మైన రోడ్ల విష‌యంలో భార‌త అవ‌స‌రాల‌ను విస్మ‌రించి పొరుగు దేశాల‌తో దోస్తీకి పెద్ద‌పీట వేస్తున్నారు.

ప్ర‌స్తుతం మనం థాయ్‌ లాండ్‌ కు వెళ్లాలంటే విమానం ఎక్కాల్సిందే. కానీ భవిష్యత్‌ లో రోడ్డు మార్గంలోనూ ఆ దేశానికి వెళ్లొచ్చు. దేశాలు దాటి వెళ్లాల్సిన ప్రాంతానికి రోడ్డు మార్గంలో ఎలా వెళ్తామని చాలా మందికి సందేహం కలుగకమానదు. అసాధ్యం అనిపిస్తున్న ఈ అంశాన్ని సుసాధ్యం చేయాలని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఢిల్లీకి 4000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న థాయ్‌ లాండ్‌ కు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా - రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మంత్రిత్వ శాఖ కొత్త సంవత్సరం ప్రాధాన్యతల్లో ఇదొకటని ఆయన చెప్పారు. అంతేకాదు నేను చెప్పింది తప్పక చేసి చూపిస్తానని మంత్రిగారు సెల‌విచ్చారు.

కొత్త రోడ్ల‌పై కేంద్ర‌మంత్రి  ప‌ట్టుద‌ల బాగానే ఉన్నా....బీజేపీతో పాటు ఇత‌ర ప‌క్షాల నేత‌లు కూడా ఆత్మీయంగా గౌర‌వించే మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌ పేయి హ‌యాంలో ప్రారంభించి గ్రామీణ స‌డ‌క్‌ యోజ‌న్‌ - స్వ‌ర్ణ చ‌తుర్భుజి ప్రాజెక్టుల‌ను ప్ర‌స్తుత మోడీ స‌ర్కారు కోల్డ్‌ స్టోరేజీలో ప‌డేసింది. కేవ‌లం కాంగ్రెస్ హయాంలో చేప‌ట్టిన ప‌లు రోడ్డు ప్రాజెక్టుల‌కు నిధులు మంజూరు చేయ‌డంలో ఉంది. దీంతో దేశంలోని అనేక రాష్ర్టాల్లో జిల్లా కేంద్రం నుంచి రాష్ర్ట రాజ‌ధానితో క‌నెక్ట‌య్యే రోడ్లు - అంత‌ర్గ‌త రోడ్లు - పొరుగు రాష్ర్టాల‌తో క‌నెక్ట‌య్యే ర‌హ‌దారులు... నాలుగు లేన్ల ర‌హ‌దారులు ఇలా ప్ర‌తి రోడ్డు స‌మ‌స్య‌ల వ‌ల‌యంలోనే ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను ప‌రిష్క‌రించ‌డాన్ని ప్ర‌థ‌మ ప్రాధాన్యంగా తీసుకోకుండా...పొరుగు దేశాల‌తో రోడ్డు మార్గాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. మోడీ చెప్పిన అచ్చే దిన్ క‌ష్టాల్లో ఉన్న సామాన్యుల‌కా లేక‌పోతే కాసుల వేట‌లో ఉన్న కాంట్రాక్టర్లు - వ్యాపార‌వేత్త‌ల‌కా అనేది అర్థం కాకుండా ఉంది.
Tags:    

Similar News