ప‌ని స్టార్ట్ కాకుంటే అటెంప్ట్ టు మ‌ర్డ‌ర్ కేసు పెట్టి రండ‌న్న కేంద్ర‌మంత్రి

Update: 2019-07-23 10:50 GMT
ఆ స‌మావేశంలో పాల్గొన్న వారికి ప‌దవులు కొత్తేం కాదు. అధికారం కూడా సుప‌రిచిత‌మే. కానీ.. కొన్ని క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో హీరో ఉదాత్త‌ను చాటే సీన్లు ఉంటాయో.. అంత‌కు మించిన రీతిలో ఒక సీన్ రియ‌ల్ లైఫ్ లో చూపించారు కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఢిల్లీలో ఆయ‌న్ను కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర పీసీసీ ర‌థ‌సార‌ధి క‌మ్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిలు క‌లిశారు.

న‌కిరేక‌ల్ - నాగార్జున సాగ‌ర్ వ‌యా న‌ల్గొండ రోడ్డు నిర్మాణ ప‌నుల్ని మ‌ధ్య‌లో ఆపేశార‌ని.. వాటిని వెంట‌నే స్టార్ట్ చేయాల‌ని కోరారు.ఈ ప‌నులు మ‌ధ్య‌లో ఆప‌టం వ‌ల్ల ఇటీవ‌ల కాలంలో దాదాపు 80 మంది మ‌ర‌ణించిన విష‌యాన్ని గ‌డ్క‌రీ దృష్టికి తీసుకెళ్లారు కాంగ్రెస్ ఎంపీలు ఇద్ద‌రూ. నిజానికి కోమ‌టిరెడ్డికి కానీ ఉత్త‌మ్ కు కానీ ప‌వ‌ర్ కొత్తేం కాదు. ఇలాంటి విన‌తులు వారి వ‌ద్ద‌కు నిత్యం వ‌స్తూనే ఉంటాయి.

వారెప్పుడూ చూడ‌ని రీతిలో గ‌డ్కరీ రియాక్ట్ కావ‌టం వారికి షాకింగ్ గా మారింది. వారి నోటి వెంట 80 మంది మ‌ర‌ణించార‌న్న మాట విన్నంత‌నే స్పందించిన ఆయ‌న‌.. నెల‌లో కొత్త కాంట్రాక్ట‌రును ఏర్పాటు చేసి ప‌నులు ప్రారంభ‌మ‌య్యేలా చూస్తా.. 80 మంది మ‌ర‌ణించ‌టం విచార‌క‌ర‌మ‌న్నారు. అక్క‌డితో ఆగితే.. ఈ వార్త రాయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎందుకంటే.. ఆ త‌ర్వాత గ‌డ్క‌రీ అన్న మాట‌లే కీల‌కం.

నెల రోజుల్లో ప‌నులు ప్రారంభం కాకుంటే నాపైనా.. అధికారుల పైనా ఐపీసీ 302 (అటెంప్టు టు మ‌ర్డ‌ర్) కేసు న‌మోదు చేయండి.. ఆ ఫిర్యాదు కాపీ ప‌ట్టుకొని త‌న వ‌ద్ద‌కు రావాల‌న్నారు. ఊహించ‌ని రీతిలో రియాక్ట్ అయిన గ‌డ్క‌రీ మాట‌ల‌కు షాక్ తిన్న కోమ‌టిరెడ్డి.. ఉత్త‌మ్ లు కంగుతిని.. అయ్యో మీరు చాలా మంచివారు.. పెద్ద మంత్రి.. మీ మీద కేసు ఎలా పెడ‌తామ‌న్నారు. దానికి గ‌డ్క‌రీ బ‌దులిస్తూ.. నేనే పెట్ట‌మ‌ని కోరుతున్నాను క‌దా.. ప‌నులు ప్రారంభం కాకుంటే మ‌ళ్లీ మీరు వ‌చ్చేట‌ప్పుడు ఎఫ్ ఐఆర్ కాపీ ప‌ట్టుకొని రండి అంటూ త‌న ఎదుట ఉన్న అధికారుల వంక చూడ‌టంతో వారు ఒక్క‌సారిగా విష‌యం అర్థ‌మైన‌ట్లుగా అలెర్ట్ అయ్యారు. ఇలా.. స‌మ‌స్య‌ల‌కు స్పందించే కేంద్ర‌మంత్రులు ఉంటే అంత‌కు మించి కావాల్సిందేముంది?  ఈ త‌ర‌హా స్పంద‌న‌కు గ‌డ్క‌రీని అభినందించాల్సిందే.

    
    
    

Tags:    

Similar News