బాబు అడ్డాలో...గ‌డ్క‌రీ దున్నేశారే?

Update: 2018-07-12 09:04 GMT
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏపీలో అధికార పార్టీకి కంచుకోట లాంటిదే. ఎందుకంటే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో జిల్లాలోని మొత్తం  15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు మూడు లోక్ స‌భ సీట్ల‌ను ఆ పార్టీ ఆధ్వ‌ర్యంలోని కూట‌మి కైవ‌సం చేసుకుంది. ఇక్క‌డ  విప‌క్ష  వైసీపీకి సింగిల్  సీటు కూడా రాలేదు. దీంతో రాష్ట్రంలోని అన్ని  జిల్లాల కంటే కూడా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాపైనే త‌న‌కు అధిక ప్రేమ ఉన్న‌ట్లు చాలా సార్లు స్వ‌యంగా ప్ర‌క‌టించిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు...  ఆ జిల్లా అంటే త‌న‌కు ప్ర‌త్యేక‌మ‌ని - ఆ  జిల్లాను చూసి  ఇత‌ర జిల్లాల నేత‌లు నేర్చుకోవాల‌ని - ఆ జిల్లా నేత‌ల మాదిరే స‌త్తా చాటాల‌ని కూడా లెక్క‌లేన‌న్ని సార్లు చెప్పారు. ఈ త‌ర‌హా బాబు వైఖ‌రితో నొచ్చుకున్న తెలుగు త‌మ్ముళ్లు లేరంటే అతిశ‌యోక్తి  కాదేమో. ఇత‌ర నేత‌ల సంగతి ప‌క్క‌న పెడితే... త‌న కేబినెట్  త‌న త‌ర్వాతి  స్థానంలో  ఉన్న డిప్యూటీ  సీఎం  కేఈ కృష్ణ‌మూర్తి  ఏకంగా బాబు వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. ఓ జిల్లాలో  వ‌చ్చిన ఫ‌లితాల‌ను చూపించి ఇత‌ర జిల్లాల నేత‌లు నేర్చుకోవాలంటూ బాబు చెప్ప‌డం స‌బ‌బు కాద‌ని - గ‌తంలో ఇత‌ర జిల్లాల్లోనూ టీడీపీ స‌త్తా చాటిన వైనాన్ని గుర్తు చేసుకోవాల‌ని కూడా కేఈ  బ‌హిరంగంగానే చంద్ర‌బాబు ముందు వ్యాఖ్యానించిన వైనం మ‌రిచిపోలేనిదే. త‌మ్ముళ్ల వాదోపవాదాలు ఎలా ఉన్నా... ప‌శ్చిమ గోదావ‌రి  జిల్లా అంటే బాబుకు త‌న సొంత అడ్డా అనే భావ‌నే ఉంది. అంతేకాకుండా ఏపీకి  జీవ‌నాడిగా  మార‌నున్న పోల‌వ‌రం ప్రాజెక్టు కూడా ఆ  జిల్లా  ప‌రిధిలోనే ఉండ‌టంతో ఆ జిల్లాపై బాబు మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌య్యారు.

ఈ క్ర‌మంలో నిన్న పోల‌వ‌రం పర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర జ‌ల‌వ‌న‌రుల  శాఖ  మంత్రి నితిన్ గ‌డ్క‌రీ... బాబును  ఆయ‌న అడ్డాలోనే బ‌హిరంగంగా - మీడియా సాక్షిగా దులిపేశార‌నే  చెప్పాలి. మీడియా స‌మ‌క్షంలో మాట్లాడుతున్న స‌మ‌యంలోనే బాబు స‌ర్కారు వైఖ‌రిపై నిప్పులు చెరిగిన గ‌డ్క‌రీ... బాబు అడ్డాలోనూ నిజాలు  మాట్లాడేంత ధైర్యం త‌మ‌కు ఉంద‌ని - ఈ విష‌యంలో బాబు వ‌చ్చినా - ఇంకెవ‌రు వ‌చ్చినా...  త‌మ‌నేమీ నిలువ‌రించ‌లేర‌ని  కూడా నిరూపించేశార‌నే  చెప్పాలి. నిన్న గ‌డ్క‌రీ  పోల‌వ‌రంలో  కొన‌సాగించిన ప‌రిశీల‌న ఆద్యంతం కూడా  బాబు ఊర‌కే చూస్తూ  నిలుచోవ‌డం మిన‌హా మ‌రేమీ  చేయ‌లేక‌పోయార‌నే చెప్పాలి. గ‌డ్క‌రీ  సంధించిన  ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌రైన స‌మాధానాలు ఇవ్వ‌లేని స్థితిలో  బాబు బాగానే ఇబ్బంది ప‌డ్డారు. ఈ మొత్తం త‌తంగం మీడియా సాక్షిగా జ‌నాలకు లైవ్‌ గానే తెలిసిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుపై ఏపీకి సంబంధించి అంత‌గా అవ‌గాహ‌న లేని కేంద్ర మంత్రి సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చేందుకు కూడా  బాబు నానా యాత‌న  ప‌డ్డారంటే... ప‌రిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం కాక‌మానదు. వ‌రుస ప్ర‌శ్న‌ల‌తో బాబు అండ్ కోను ఉక్కిరిబిక్కిరి  చేసిన గ‌డ్క‌రీ... చివ‌ర‌కు బాబు  స‌ర్కారుకు డెడ్‌ లైన్‌ తో పాటుగా  ఘాటు హెచ్చ‌రిక‌లు జారీ చేసి వెళ్లిపోయారు. గ‌డ్క‌రీ  త‌న‌దైన శైలిలో ప్ర‌శ్న‌లు  సంధిస్తూ ఉంటే... బాబు  అలా  నిశ్చేష్టుడిలా  నిల‌బ‌డిపోక త‌ప్ప‌లేదు. ఎందుకంటే... ఓ  కేంద్ర మంత్రిగా గ‌డ్క‌రీ... ఆయా అంశాల‌పై త‌న‌దైన శైలి ప‌ట్టు సాధిస్తే... కేంద్ర మంత్రి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న  వ‌ద్ద స‌మాధానాలే లేవ‌న్న రీతిలో బాబు వ్య‌వ‌హార స‌ర‌ళి కొన‌సాగింది.

గ‌డ్క‌రీ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానాలు  చెప్పాలంటూ బాబు... రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల  శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్  కుమార్ వైపు  దీనంగా చూడ‌టం, ఓ వైపు బాబును చూసి  గ‌డ్క‌రీ ప్ర‌శ్న‌లు వేస్తుంటే... బాబు మాత్రం శ‌శిభూష‌ణ్ కుమార్ చెవిలో ఏదో  పోరుతూ  క‌నిపించిన వైనం కూడా బాబు  డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెట్టేసిందన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. పోల‌వ‌రంపై త‌మ‌కు త‌ప్పించి మిగిలిన ఏ ఒక్క‌రికి కూడా అవ‌గాహ‌న లేద‌న్న ధీమాతో  ఉన్న టీడీపీ నేత‌ల‌కు గ‌డ్క‌రీ బాగానే బుద్ధి చెప్పార‌న్న వాద‌న కూడా  వినిపిస్తోంది.  గ‌డ్క‌రీ ప్ర‌శ్న‌లు సంధిస్తున్న స‌మ‌యంలో బాబు ప‌క్క‌న శ‌శిభూష‌ణ్ కుమార్‌తో పాటుగా రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల‌పై త‌మ‌కు త‌ప్పించి ఇత‌రుల‌కు మాట్లాడే హ‌క్కే లేద‌ని, త‌మ‌కు ఉన్న విష‌య ప‌రిజ్ఞాన‌మే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని భావిస్తున్న రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల  శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా అక్క‌డే ఉన్నా... క‌నీసం నోరు విప్ప‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌డ్క‌రీ  సంధిస్తున్న లెక్క‌లేన‌న్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు స‌ర్దుకోవ‌డం - వెతుక్కోవ‌డానికే ప‌రిమిత‌మైన చంద్ర‌బాబు... ఆ త‌ర్వాత కూడా గ‌డ్క‌రీ  అడిగిన ఏ ఒక్క ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు. మొత్తంగా బాబు అడ్డాలోనే  ఆయ‌న‌ను గ‌డ్క‌రీ దులిపేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాకుండా పోల‌వ‌రంపై బాబు కంటే కూడా  గ‌డ్క‌రీకే  ఎక్కువ అవ‌గాహ‌న ఉన్న‌ట్లుగా నిన్న‌టి  పోల‌వ‌రం సంద‌ర్శ‌న చెప్పింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News