లాలూ కొడుకుల‌కు నితీశ్ అల్టిమేటం

Update: 2017-10-14 13:11 GMT
2015 ప్రారంభంలో బిహార్‌లో క‌లిసి అధికారం పంచుకున్న ఆర్ జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, జేడీయూ నేత నితీశ్ కుమార్ ల మ‌ధ్య త‌లెత్తిన విభేదాలు తీవ్ర రూపం దాల్చ‌డం అప్ప‌టికే డిప్యూటీ సీఎంగా ఉన్న లాలూ కుమారుడు - మంత్రిగా ఉన్న మ‌రోకుమారుడిని సాగ‌నంపే ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డం తెలిసిందే. లాలూ కుమారులు అవినీతికి పాల్ప‌డ్డార‌నేది నితీశ్ కామెంట్‌. అయితే, ఈ క్ర‌మంలో లాలూ మాత్రం నితీశ్‌ కు త‌లొంచ‌లేదు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మౌన యుద్ధం కాస్తా.. సీఎంగా నితీశ్ హ‌ఠాత్తుగా రాజీనామా చేసేసి.. కేంద్రంలోని బీజేపీతో జ‌ట్టు క‌ట్టి.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు.

అయితే, లాలూ కుమారుల‌పై నితీశ్ ఆగ్ర‌హం ఇప్ప‌టికీ చ‌ల్లార‌లేదని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే వారు నివ‌సిస్తున్న ప్ర‌భుత్వ బంగ‌ళాల‌ను త‌క్ష‌ణ‌మే ఖాళీ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నిర్ణ‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.  మాజీ మంత్రులు ఒకవేళ ప్ర‌భుత్వ బంగ‌ళాల‌ను ఖాళీ చేయని పక్షంలో మార్కెట్‌ ధర కంటే 15రెట్లు అధికంగా అద్దె చెల్లించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. నిజానికి మాజీ మంత్రులు, లాలూ కుమారులు తేజస్వీయాదవ్‌ - తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పదవుల్లో ఉన్న సమయంలో వారికి పెద్ద పెద్ద బంగ్లాలను కేటాయించారు.

అయితే.. తనను అందులోనే ఉండనివ్వాల్సిందిగా కోరుతూ ఇటీవల తేజస్వీ సీఎం నితీశ్‌ కుమార్‌ ను కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తును సీఎం తిరస్కరించారు. ప్రభుత్వ భవనాలపై ఎవరూ ప్రేమ పెంచుకోవద్దని సీఎం నితీశ్‌ పరోక్షంగా తేజస్వీకి సూచించారు. ఇంత‌లోనే ఈ విధంగా రోడ్లు భ‌వ‌నాల శాఖ ఘాటుగా నోటీసులు పంప‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. మ‌రి దీనిపై లాలూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా.. లాలూ మ‌రోసారి నితీశ్ పై నిప్పులు కురిపించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News