ప్రశాంత్ కిషోర్ బయటకు వెళ్లిపో

Update: 2020-01-28 15:57 GMT
ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు కావాల్సిన వ్యక్తిగా మారిపోయిన ప్రశాంత్ కిశోర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూనే.. తన సొంత రాష్ట్రం బీహార్ లోని అధికార పార్టీ జేడీఎస్ లో చేరిన పీకే... రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేశారు. అయితే స్ట్రాటజిస్ట్ గా సక్సెస్ అయిన పీకే... పోలిటీషియన్ గా మాత్రం బోల్తా పడిపోయారు. జేడీఎస్ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో పొడచూపిన విభేధాల కారణంగా ఇప్పుడు పీకే ఆ పార్టీ నుంచి ఏకంగా నిష్క్రమించక తప్పని పరిస్థితులు నెలకొనడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే ఉండు. లేదంటే పార్టీ నుంచి వెళ్లిపో’ అంటూ పీకేపై నితీశ్ ఓ రేంజిలో వ్యాఖ్యలు చేయడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.

అయినా పార్టీలో చేరిన వెంటనే... ఏకంగా పీకేకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చేసిన నితీశ్... ఇప్పుడు ఏకంగా బయటకు వెల్లిపో అంటూ వ్యాఖ్యలు చేశారంటే... ఏదో సీరియస్ వ్యవహారమే నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జేడీఎస్ మిత్రపక్షంగానే సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ విధానలను వ్యతిరేకించడం జేడీఎస్ కు, ఆ పార్టీలోని నేతలకు అంతగా నప్పదు. అయితే ఇవేవీ పట్టని పీకే... బీజేపీ సర్కారు తాజాగా తీసుకువచ్చిన సీఏఏ, ఎన్పీఆర్ తదితర చట్టాలపై బహాటంగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం హోరాహోరీగా సాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పీకే దూరిపోయారు. ఢిల్లీలోని అధికార పార్టీ ఆప్ కు స్ట్రాటజిస్ట్ గా వ్యవహరిస్తున్న పీకే... ఆ పనికే పరిమితం కాకుండా ఏకంగా ఆప్ తరఫున ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో బీజేపీ తాజా మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సున్నం పెట్టుకున్నారు.

అమిత్ షా వర్సెస్ పీకే వ్యవహారం ఓ రేంజిలో సాగింది. అంతేకాకుండా సీఏఏ, ఎన్పీఆర్ లను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును కూడా సమర్థిస్తూ సాగిన పీకే... సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల పర్యటనలను, వ్యాఖ్యలను సమర్థిస్తూ పీకే ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పీకే అంటే బీజేపీకి ఓ రేంజి వ్యతిరేకత ఏర్పడినట్టే లెక్క. తన మిత్రపక్షానికి చెందిన నేత తమపైనే విమర్శలు సంధిస్తే ఏ పార్టీ కూడా ఊరుకోదు కదా. ఆ మేరకే... బీజేపీ అధిష్ఠానం నితీశ్ ను పిలిచి పీకేను అదుపులో పెట్టుకోవాలని కూడా సూచించినట్లు సమాచారం. బీజేపీ నుంచి వచ్చిన మాటతోనే రంగంలోకి దిగిన నితీశ్... స్పీడు తగ్గించాలని పీకేకు సూచించారట. అయితే అందుకు ససేమిరా అనడంతో నితీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా పార్టీలో ఉంటే ఉండు... లేదంటే నీ ఇష్టం అంటూ కేకలేశారట. మొత్తంగా చూస్తే... స్ట్రాటజిస్ట్ గా సక్సెస్ అయిన పీకే... పొలిటీషియన్ గా మాత్రం సక్సెస్ కాలేక... ఇప్పుడు ఏకంగా జేడీఎస్ నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News