అర్వింద‌న్నా ఇదేందే.. నిజామాబాద్ ఖాళీ అవుతాందే!!

Update: 2022-12-20 13:30 GMT
ఔను! ఇప్పుడు తెలంగాణ‌లో రాజ‌కీయ కుస్తీల‌కు కేరాఫ్‌గా ఉన్న నిజామాబాద్ ఖాళీ అవుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ నుంచి వ‌ల‌స పోతున్న జ‌నాభాలో నిజామాబాద్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. మ‌రి ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీ అయిన బీజేపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ ధ‌ర్మ‌పురి అర్వింద్‌..

అప్ప‌ట్లో వ‌ల‌స‌లు త‌గ్గిస్తా.. ఉపాధి చూపిస్తా.. అంటూ.. చేసిన కామెంట్లు ఏమ‌య్యాయ‌ని.. యాదిలేవా? అని ఇక్క‌డి జ‌నాలు నిల‌దీస్తున్నారు. ఇక‌, ఇదే విష‌యాన్ని నెటిజ‌న్లు కూడా అర్వింద‌న్నా.. ఇదేందే.. నిజామాబాద్ ఖాళీ అవుతాందే!! అంటూ స‌టైర్లు వేస్తున్నారు.

విష‌యం ఏంటంటే.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణ నుంచి వ‌ల‌స‌లు ప‌డుతున్న ప్ర‌జ‌ల  సంఖ్య  భారీగా పెరిగిపోయింది. ఇలా పొట్ట చేత‌ప‌ట్టుకుని పొరుగు దేశాల బాట ప‌డుతున్న వారిలో అర్వింద్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్ ప్ర‌జ‌లే ఎక్కువ‌గా ఉన్నారు. ఇదేదో కిట్ట‌ని.. తెలంగాణ అధికార పార్టీ నాయ‌కులో.. కేసీఆర్ అనుంగులో అర్వింద్‌పై వేసిన విమ‌ర్శ‌ల రాళ్లుకాదు.. నేరుగా.. బీజేపీ అధీనంలోని  కేంద్ర ప్ర‌భుత్వమే పార్ల‌మెంటు సాక్షిగా నిన్న గాక మొక్క మొహం మీద గుద్దిన‌ట్టు చెప్పిన లెక్క‌లు!!

2021లో రాష్ట్రం నుంచి మొత్తం 4,375 మంది గల్ఫ్‌ దేశాల బాట పట్టారు. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికే ఈ సంఖ్య 8,547కు చేరింది.  వీరిలో 4 వేల మంది పైచిలుకు.. నిజామాబాద్ నుంచి వెళ్లిన వారే ఉన్నార‌ని..కేంద్రం చెప్పుకొచ్చింది. ఖతర్, యూఏఈ, సౌదీ, ఒమన్, కువైట్, బర్హేన్‌లకు వెళ్తున్న‌వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని తెలిపింది.

అలా దేశాంతరం  వెళ్లిన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం వస్తోంద‌ని కేంద్ర‌మే చెప్పింది.  మ‌రి వీళ్లంద‌రికీ ఇక్క‌డే ఉపాధి చూపిస్తాన‌ని చెప్పిన అర్వింద‌న్న ఏడున్నాడు? అని నిజామాబాద్ ప్ర‌జ‌లు చెవులు కొరుక్కుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News