ఏపీలో ప్ర‌చారానికి సినీ గ్లామ‌ర్ లేన‌ట్లే!

Update: 2019-01-10 09:54 GMT
ఎన్నిక‌ల్లో ప్ర‌చార ప‌ర్వానిది కీల‌క పాత్ర‌. అభ్య‌ర్థులు జ‌నాల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు - తాము ఏం చేయ‌బోయేది చెప్పేందుకు అది ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌చార స‌భ‌ల‌కు వ‌చ్చే జ‌నం అభ్య‌ర్థుల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే ప్ర‌చార ప‌ర్వంలో అన్ని పార్టీల అభ్య‌ర్థులు అత్యంత క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు. జ‌నాన్ని స‌మీక‌రించేందుకు శాయ‌శ‌క్తులా కృషిచేస్తారు. అందుకోసం అవ‌స‌ర‌మైతే సినీ స్టార్ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. వారిని త‌మ త‌ర‌ఫున‌ ప్ర‌చారానికి ర‌ప్పిస్తుంటారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌తంలో చాలా మంది స్టార్లు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా నంద‌మూరి తార‌క రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాక తెలుగునాట రాజ‌కీయాల్లో సినీ గ్లామ‌ర్ పెరిగిపోయింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలామంది సినీ ప్ర‌ముఖులు విచ్చేసి త‌మకు అనుకూల‌మైన పార్టీల త‌ర‌ఫున‌, త‌మ అనుకూల అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేసేవారు.

రానున్న అసెంబ్లీ, లోక్ స‌భ‌ ఎన్నిక‌ల్లో మాత్రం ఏపీలో ప్ర‌చారానికి సినీ స్టార్లు దూరంగా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎవరి తరఫున ప్రచారం చేసినా వారి మనిషిగా ముద్ర పడితే ఎన్నికల తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయని సినీ స్టార్లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ప్ర‌చారానికి దూరంగా ఉండేందుకే వారు మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇదే ఒర‌వ‌డి క‌నిపించింది. స్వ‌యంగా త‌న సోద‌రి సుహాసిని బ‌రిలో దిగినా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారం చేయ‌లేదు. టీఆర్ ఎస్ అగ్ర నాయ‌క‌త్వంతో ఆయ‌న‌కున్న స‌త్సంబంధాలే అందుకు కార‌ణ‌మ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. బాల‌కృష్ణ ప్ర‌చారం చేసినా.. ఆయ‌న రాజ‌కీయాల్లోని మ‌నిషే. ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన బ‌రిలో నిలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారానికి వ‌చ్చేందుకు స్టార్లు ఎవ‌రూ ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌. ప‌వ‌న్ త‌ర‌ఫున ప్ర‌చారానికి వ‌స్తే టీడీపీ - వైసీపీ పార్టీల్లోని త‌మ అభిమానులు నొచ్చుకుంటార‌ని, ఆ ప్ర‌భావం త‌మ సినిమాల‌పై ప‌డుతుంద‌ని వారు జంకుతున్నార‌ట‌. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన న‌టీన‌టులు మాత్రమే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో ప్ర‌చారం చేయ‌నున్నార‌ట‌. దీంతో ఏపీలో ప్ర‌చారానికి సినీ గ్లామ‌ర్ లేకుండా పోతోందేన‌ని ప‌లువురు నిట్టూరుస్తున్నారు.





Full View
Tags:    

Similar News