రాష్ట్ర అవతరణ దినోత్సవంలో జాతీయ జెండా ఎగరదా?

Update: 2019-11-01 03:06 GMT
భావోద్వేగాలకు సంబంధం లేకుండా ఏపీ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని నిర్వహించిన ఘనత బాబు సర్కారుకే దక్కింది. రాష్ట్రం ముక్కలైన రోజునే ఆవతరణదినోత్సవాన్ని నవ నిర్మాణ దీక్ష పేరుతో నిర్వహించిన అప్పటి బాబు ప్రభుత్వం ఏ మాత్రం లాజిక్ లేని లెక్కను చెప్పేది. ప్రజలు ఏ మాత్రం కనెక్ట్ కాని ఈ విషయంలో బాబు సర్కారు చేసిన తప్పు అంతా ఇంతా కాదు. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో నవ నిర్మాణ దీక్ష పేరుతో చేసిన హడావుడి.. పెట్టిన కోట్ల రూపాయిల ఖర్చును ఏపీ ప్రజలు మర్చిపోలేరు.

ఇదిలా ఉంటే.. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దే పనిని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా జూన్ 2న నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని మార్చేసింది. అందుకు బదులుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆవతరణ దినోత్సవమైన నవంబరు ఒకటిన చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆవతరణ దినోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల్ని నిర్వహించాలని డిసైడ్ చేశారు.

అయితే.. ఆవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం ఉండదా? అంటే.. ఆ అవకాశం తక్కువగా ఉందంటున్నారు. సాధారణంగా రాష్ట్ర ఆవతరణ.. స్వాతంత్య్ర దినోత్సవం.. గణతంత్ర వేడుకుల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తుంటారు. అయితే.. ఈ రోజు నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలకు నిర్ణయించిన సమయమే.. జాతీయ జెండా ఆవిష్కరణకు అడ్డుగా మారిందని చెబుతున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయత్రం 5.55 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఈ వేడుకలకు హాజరు కానున్నారు. సాధారణంగా జాతీయ జెండాను ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఎగురవేస్తారు. తర్వాత అవనతం చేయటం సంప్రదాయం. ఇదిలా ఉంటే.. సీఎం రావటమే 5.55 గంటలకు వచ్చినప్పుడు జాతీయ జెండా ఆవిష్కరణ.. ఆ వెంటనే అవనతం అంటే బాగోదంటున్నారు. ఈ కారణంగా జాతీయ జెండా ఆవిష్కరణ లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఒకేవేళ జాతీయ జెండా ఆవిష్కరించినా.. కేవలం ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే అవనతం చేయాల్సి ఉంటుంది.

#APFormationDay
Tags:    

Similar News