ఏపీలో పంచాయ‌తీ స‌ర్పంచ్‌లు విల‌విల‌!

Update: 2022-09-08 05:25 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రెండేళ్ల క్రితం జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో దాదాపు 90 శాతం స్థానాల‌ను వైఎస్సార్సీపీ సానుభూతిప‌రులే గెల్చుకున్నారు. అయితే ఇప్పుడు వారంతా విల‌విలలాడుతున్నార‌ని చెబుతున్నారు. ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లాలో 38 మండ‌లాల పరిధిలో 729 పంచాయ‌తీలు ఉన్నాయి. వీటికి 15వ ఆర్థిక సంఘం కింద రూ.130 కోట్ల నిధులు మంజూరు కాగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ మొత్తంలో ఇప్ప‌టికే రూ.70 కోట్ల‌ను వెన‌క్కి తీసేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

పంచాయ‌తీ స‌ర్పంచ్‌లుగా ఎన్నికైన‌వారు త‌మ గ్రామాల అభివృద్ధికి రూపాయి కూడా ఖ‌ర్చుపెట్ట‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని చెబుతున్నారు. కొన్ని చోట్ల స‌ర్పంచ్‌లు త‌మ సొంత డ‌బ్బుల‌తో గ్రామాల్లో ముఖ్య‌మైన తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్ల మ‌ర‌మ్మ‌తులు వంటివి చేయిస్తున్నారు. ఒక్క ప్ర‌కాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ముందు గ్రామపంచాయతీల్లో అధికారుల పాలన ఉంది. ఆ సమయంలో నిధుల మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లించింద‌ని చెబుతున్నారు. ఆ త‌ర్వాత 14వ ఆర్థికసంఘం నిధులను రాత్రి రాత్రికే ప్రభుత్వం న‌వ‌ర‌త్న ప‌థ‌కాల కోసం స్వాహా చేసింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయినా స‌ర్పంచ్‌లు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. నిధుల లేమితో చివ‌ర‌కు విద్యుత్ బిల్లులు చెల్లించ‌లేక‌పోతున్నారు. అంతేకాకుండా చెత్త బండి లాగే వారికి వేత‌నాలు ఇవ్వ‌డానికి డ‌బ్బులు లేక గుంటూరు జిల్లా వ‌ట్టిచెరుకూరు మండ‌లం కాట్ర‌పాడు గ్రామ స‌ర్పంచ్ స్వ‌యంగా చెత్త బండిని లాగుతూ ఇంటింటికీ తిరిగాల్సి వ‌చ్చింది.

ఇక‌ 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా ఈ ఏడాది మార్చిలో రాత్రి రాత్రే రాష్ట్రప్రభుత్వం హాంఫట్‌ చేసింద‌ని చెబుతున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు పెద్దఎత్తున ఆందోళనలకు దిగడంతో ఆ నిధులను ప్రభుత్వం తిరిగి పంచాయతీ ఖాతాలకు జమచేసింది. మ‌ళ్లీ ఆ సమయంలోనే వాటిని విద్యుత్‌ బకాయిల పేరుతో  తిరిగి జమ చేసేసుకుందని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.

తాజాగా ఇప్పుడు మరోసారి విద్యుత్‌ బకాయిలను వెలుగులోకి తెచ్చి అక్టోబ‌ర్‌లో పంచాయతీలకు రానున్న 15వ ఆర్థికసంఘం మూడో విడత నిధులను స్వాహా చేసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సర్పంచ్‌ల సంఘం నేతలు ఆందోళనల‌కు సిద్ధమవుతున్నారు. రాష్ట్రప్రభుత్వం తన తీరును మార్చుకుని స్థానిక సంస్థలను బలోపేతం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News