కొత్త ఆర్డ‌ర్ః ఆ న‌దులు..ప్రాణులు కాదు

Update: 2017-07-07 16:26 GMT
మ‌నుషుల‌కు వ‌ర్తించే న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కులు జీవ‌న‌దులైన గంగా, య‌మున‌ల‌కు కూడా చెల్లుతాయ‌ని ఇటీవ‌ల ఉత్త‌రాఖండ్ హై కోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్న‌త న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. ప‌విత్ర గంగా న‌ది, దాని ఉప‌న‌ది య‌మున జీవం ఉన్న ప్రాణులు (Living Entity) కావంటూ ఇవాళ సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. గంగా, య‌మునా న‌దుల వ‌ల్ల మాన‌వ‌జాతి వ‌ర్థిల్లుతున్న‌ద‌న్న విష‌యం వాస్త‌వ‌మే అని, కానీ స‌మాజంలో న‌దుల ప‌ట్ల ఉన్న విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని వాటిని జీవం ఉన్న వ్య‌క్తులుగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది.

మ‌న‌దేశ నాగ‌రిక‌త గంగ‌తోనే మొద‌లైంద‌ని, దేశంలో తొలి జీవించి ఉన్న ప్రాణి (Living Entity) గంగేన‌ని మార్చి నెల‌లో ఉత్త‌రాఖండ్ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. గంగ‌తోపాటు దాని ఉప‌న‌ది య‌మున‌కు కూడా ఈ హోదా ల‌భించింది. ఈ హోదా వ‌ల్ల న‌మామి గంగా పేరుతో జ‌రుగుతున్న గంగా ప్ర‌క్షాళ‌న ప్రాజెక్ట్‌కు మ‌రింత ప్రాధాన్య‌త ద‌క్కింది. త‌మ తీర్పు సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నంలోని న్యాయ‌మూర్తులు రాజీవ్ శ‌ర్మ‌, అలోక్ సింగ్.. న్యూజిలాండ్‌లోని వాంగ‌నుయ్ న‌దికి ఇలాంటి హోదానే ల‌భించింద‌ని గుర్తుచేశారు. ఇక ఈ న‌దుల బాగోగుల‌ను చూసుకోవ‌డానికి ముగ్గురిని ప్ర‌త్యేకంగా నియ‌మించింది కోర్టు. న‌మామి గంగా ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌, ఉత్త‌రాఖండ్ చీఫ్ సెక్ర‌ట‌రీ, అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌ల‌కు ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. గంగ‌తోపాటు దాని ఉప‌న‌దుల ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను వీళ్లు చూసుకోవాల్సి ఉంటుంది.

గంగా తీరంలో అక్ర‌మంగా సాగుతున్న మైనింగ్‌ను అరిక‌ట్టాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై విచారించిన హైకోర్టు.. ఈ తీర్పు వెలువ‌రించింది. శ‌తాబ్దాలుగా గంగా భార‌త జీవ‌న గ‌మ‌నంలో భాగంగా ఉంది. ఇక్క‌డి ఎన్నో జాతుల సంస్కృతీ సాంప్ర‌దాయాలు గంగ‌తో ముడిప‌డి ఉన్నాయి. అయితే గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఇది ప్ర‌పంచంలోని అత్యంత క‌లుషితమైన న‌దుల్లో ఒక‌టిగా నిలుస్తోంది. గంగను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ఎన్నో ఉద్య‌మాలు న‌డిచాయి. కోర్టులు కూడా ఎన్నో ఆదేశాలు జారీ చేశాయి. గంగ తీరంలో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసివేయాల‌న్న డిమాండ్లు ఉన్నా అవి నెర‌వేర‌లేదు. ప్ర‌స్తుత మోడీ ప్ర‌భుత్వం న‌మామి గంగా పేరుతో న‌దిని శుభ్రం చేసే ప‌ని మొద‌లుపెట్టింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ రాష్ట్రం ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తుందో అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.
Tags:    

Similar News