చంద్రబాబు ఆశల పై నీళ్ళు చల్లినట్లేనా ?

Update: 2021-11-16 05:49 GMT
వచ్చే ఎన్నికల్లోగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న చంద్రబాబునాయుడు ఆశలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నీళ్ళు చల్లినట్లే ఉన్నారు.  బీజేపీ ముఖ్యనేతలతో  తిరుపతిలో షా భేటీ అయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్య నేతలకు షా అనేక ఆదేశాలు జారీచేశారు. వీటిల్లో అతి ముఖ్యమైనవి ఏమిటంటే చంద్రబాబునాయుడుతో దూరం పాటించటం, ముఖ్య నేతలను ఆకర్షించి బీజేపీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేయటం.

నిజానికి షా చెప్పిన రెండు పాయింట్లు కూడా చాలా కీలకమైనవే. పైగా రెండు ఇంటర్లింకుడు పాయింట్లే కావటం గమనార్హం. ఎలాగంటే చంద్రబాబుతో భవిష్యత్తులో పొత్తుండదని స్పష్టంగా చెప్పారు. ఎలాగూ టీడీపీతో పొత్తుండదు కాబట్టి ఆ పార్టీ నేతలను బీజేపీలోకి ఆకర్షించమని పరోక్షంగా చెప్పారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నేతలను ఆకర్షించి బీజేపీని బలోపేతం చేయాలని షా ముఖ్య నేతలకు చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటి ? ముఖ్యమైన నేతలంటే టీడీపీ నుంచి తప్ప కమలం పార్టీలో చేరే నేతలు ఇంకే పార్టీలోను లేరు.

ఎందుకంటే అధికార వైసీపీలో నుంచి బీజేపీలోకి చేరే నేతలు దాదాపు లేరనే చెప్పాలి. టీడీపీకే భవిష్యత్తు లేదని అనుకుంటుంటే ఇక బీజేపీలో చేరే నేతలు ఎవరుంటారు ? నిజానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేయటానికి బీజేపీకి బలమైన నేతలే లేరని అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో కమలం పార్టీకి పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటానికి కూడా నేతలు లేరు. దీంతోనే బీజేపీ బలమేమిటో అందరికీ అర్ధమైపోతోంది.

ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కమలనాథులు గోల చేస్తున్నారంతే. వైసీపీకి ఎలాగు బీజేపీతో కలిసే ఉద్దేశ్యమే లేదు. ఇదే సమయంలో కమలంతో కలవాలని తహతహ లాడుతున్నది చంద్రబాబు మాత్రమే. తాజాగా షా కామెంట్స్ చూస్తుంటే చంద్రబాబు ఆశలపైన నీళ్ళు చల్లేసినట్లే ఉంది. అందుకనే టీడీపీలోని బలమైన నేతలను బీజేపీలోకి ఆకర్షించే బాధ్యత మాజీ తమ్ముళ్లు సుజనా చౌదరి, సీఎం రమేష్ మీదే పెట్టినట్లున్నారు. అందుకనే ప్రత్యేకంగా వీరిద్దరితో షా భేటీ అయ్యారట.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీలో చాలామంది ఒరిజినల్ నేతలకు టీడీపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యమే లేదు. కానీ టీడీపీ నుండి బీజేపీలోకి ఫిరాయించిన వారు, చేరిన నేతలు మాత్రం రెండు పార్టీల మధ్య పొత్తును కోరుకుంటున్నారు. ఇలాంటి వారిలో సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ముందున్నారు. తాజాగా షా మాటలు విన్న తర్వాత వీరిద్దరూ బాగా డిజప్పాయింట్ అయినట్లే ఉన్నారు. మరి ఆపరేషన్ ఆకర్ష్ ఎప్పటినుండి కమలనాథులు మొదలుపెడతారన్నదే ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News