హుజూర్ నగర్ పై టీఆర్ ఎస్ ఆశలు వదిలేసిందా?

Update: 2019-10-20 06:05 GMT
తెలంగాణలో ఉధృతమైన ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు.. ఇలా అంతటా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న వేళ తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నికపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఆశలు వదుకున్నట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

మొదట అందరికంటే ముందే సమరశంఖం పూరించిన టీఆర్ ఎస్ హుజూర్ నగర్ లో మోహరించింది. మంత్రులు కేటీఆర్ - జగదీష్ రెడ్డి సై అంటూ టీఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా తొడగొట్టి ప్రచారం ప్రారంభించారు.

అయితే ఆ తర్వాత ట్రైయిన్ రివర్స్ అయ్యింది. ఆర్టీసీ సమ్మెతో  టీఆర్ ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో  వ్యతిరేకత పెల్లుబుకింది. సైదిరెడ్డి - స్థానిక నాయకులు ఇంకా తీవ్రంగా ప్రచారం చేస్తున్నా పార్టీ అగ్రనేతలు అయిన సీఎం కేసీఆర్ - కేటీఆర్ - హరీష్ లాంటి వాళ్లు ప్రచారానికి దూరంగా ఉండడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. వారి నుంచి మద్దతు లేక గెలుపుపై ధీమా వారిలో సడలుతోంది.

ప్రచారానికి వెళితే ఆర్టీసీ కార్మికులు ప్రతీకారం తీర్చుకుంటారని.. పరువు తీస్తారనే కేసీఆర్ - కేటీఆర్ వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తోంది.

ఇక బీజేపీ ప్రోద్బలంతో హుజూర్ నగర్ పై ఈసీ డేగకన్ను వేసి టీఆర్ ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.   సూర్యపేట ఎస్పీని బదిలీ చేసి స్ట్రిక్ట్ ఆఫీసర్ ను ఎస్పీగా నియమించింది. దీంతో  గులాబీ పార్టీకి పోలీసుల సహాయనిరాకరణ కూడా దెబ్బతీస్తోందన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే పోలీసులు టీఆర్ ఎస్ మద్దతు దారుల నుంచి భారీ మొత్తంలో డబ్బు - మద్యం స్వాధీనం చేసుకున్నారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి స్నేహితుడి పాఠశాల నుంచి డబ్బు పంపిణీకి ఏర్పాటు చేయగా దాన్ని మూసివేయించారని సమాచారం.

 ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ చీలిస్తే కాంగ్రెస్ ఓడుతుందనే ఆశ టీఆర్ ఎస్ లో ఉంది. బీజేపీ కూడా ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకోవడంతో కొన్ని ఓట్లు చీలి లాభం జరుగుతుందని గులాబీ పార్టీ కలలుగంటోంది. ఇక అర్బన్ ఓటు బ్యాంకు గులాబీకే పడుతుందని ఆశలు పెంచుకుంది. అయితే అంతిమంగా ప్రస్తుత పరిస్థితులు టీఆర్ ఎస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేవనే చర్చ నడుస్తోంది.
   

Tags:    

Similar News