మాల్యా రుణ స‌మాచారం లేదు...ఆర్థిక శాఖ‌!

Update: 2018-02-07 11:48 GMT
స్వ‌దేశంలోని బ్యాంకుల‌కు దాదాపు 9 వేల కోట్ల రూపాయ‌లు పంగ‌నామం పెట్టి....విదేశాలకు చెక్కేసిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాను భార‌త్ కు ఎప్పుడు ర‌ప్పిస్తారా అంటూ భార‌తీయులంద‌రూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భార‌త్ కు మాల్యా తిరిగి వ‌చ్చిన వెంట‌నే అత‌డిపై ఆర్థిక శాఖ క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూస్తున్నారు. అయితే, ఆ విధంగా ఎదురుచూస్తున్న వారంద‌రికీ భార‌త ఆర్థిక శాఖ షాకిచ్చింది. అస‌లు మాల్యాకు సంబంధించి త‌మ ద‌గ్గ‌ర ఎలాంటి రికార్డులు లేవ‌ని స్వ‌యంగా ఆ శాఖ ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.
బ్యాంకుల‌కు మాల్యా ఎంత రుణ‌ప‌డ్డాడు....సంబంధిత వివరాలు కావాల‌ని రాజీవ్‌ కుమార్‌ ఖరే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్థికశాఖకు దరఖాస్తు చేశారు.

అయితే ఆ వివరాలు తాము ఇవ్వలేమని ఆర్థికశాఖ పేర్కొంది. వ్యక్తిగత భద్రత - దేశ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే వివరాలు ఇవ్వ‌కపోయినా ప‌ర్లేద‌ని ఆర్టీఐ చట్టంలో కొన్ని మినహాయింపులున్నాయని తెలిపింది. ఆ శాఖ వైఖ‌రితో విసిగిపోయిన రాజీవ్‌....కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) ని ఆశ్రయించారు.అయితే, సీఐసీకి కూడా ఇదే స‌మాధానం ఎదురైంది. మాల్యా రుణాలకు సంబంధించిన రికార్డులేవీ తమ ద‌గ్గ‌ర లేవని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఆయా బ్యాంకులు లేదా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద‌గ్గ‌ర ఆ స‌మాచారం ఉండొచ్చని పేర్కొంది. ఆర్థికశాఖ సమాధానంపై సీఐసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టప్రకారం 'ఇది అస్పష్టమైన, అస్థిరమైన జవాబు' అని తెలిపింది. రాజీవ్‌ దరఖాస్తును వెంట‌నే సంబంధిత పబ్లిక్‌ అథారిటీకి బదిలీ చేయాలని ఆర్థిక‌శాఖ‌కు సూచించింది. ఆ వివ‌రాలు త‌మ‌ వద్ద లేవని చెబుతున్న ఆర్థికశాఖ గతంలో వాటిని పార్లమెంట్ లో ప్రస్తావించడం గమనార్హం. మ‌రి, సీఐసీ సూచ‌న‌ల‌ను ఆర్థిక శాఖ ఎంత‌వ‌ర‌కు పాటిస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News