లాభ‌మా..న‌ష్ట‌మా?; క‌్రెడిట్ కార్డు కొత్త రూల్స్‌

Update: 2015-07-17 09:12 GMT
ఇవాల్టి రోజున న‌గ‌రాల్లో ఉండే వారు.. ఓ మోస్త‌రు ప‌ట్ట‌ణాల్లో ఉండే వారు క్రెడిట్ కార్డు వినియోగించ‌టం ఒక అల‌వాటుగా మారిపోయింది. అయితే.. క్రెడిట్ కార్డు తీసుకునే విష‌యంలో చూపించే ఆస‌క్తి.. కార్డును గీకేసి ఖ‌ర్చు పెట్టే సమ‌యంలో ఉండే హుషారు.. ఆ ఖ‌ర్చుల్ని తిరిగి చెల్లించే విష‌యంలో కొంద‌రు అస్స‌లు ప‌ట్టించుకోరు. ఇలాంటి బ్యాచ్ తో పాటు.. చేతిలో ఉండే నాలుగైదు కార్డుల్లో.. ఏ కార్డు పేమెంట్ ఎప్పుడు అన్న విష‌యాన్ని మ‌ర్చిపోయి.. నాలుక్క‌ర్చుకొని తిరిగి చెల్లించే స‌మ‌యానికి భారీగా బాదుడు ప‌డ‌టం మామూలే.

అయితే.. ఇలాంటి విష‌యాల‌పై తాజాగా కొత్త నిబంధ‌న‌లు వ‌చ్చాయి. కొత్త‌గా వ‌చ్చిన నిబంధ‌న‌ల్ని చూస్తే.. వినియోగదారుల‌కు కాస్తంత మేలు క‌లిగించేవిగా ఉండ‌టం గ‌మ‌నార్హం. క్రెడిట్ కార్డు మీద చెల్లించాల్సిన మొత్తాన్ని.. స‌ద‌రు బ్యాంక‌ర్ పేర్కొన్న గ‌డువు తేదీలోపు క‌ట్టకున్నా.. మ‌రో మూడు రోజులు అద‌నంగా గ్రేస్ పిరియ‌డ్ ఇవ్వాల‌ని.. అంత‌వ‌ర‌కూ ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు విధించ‌కూడ‌ద‌ని పేర్కొంది.

గ‌డువు తీరిన త‌ర్వాత మూడు రోజులు దాటిన ఖాతాల మీద మాత్ర‌మే లేట్ ఫీజు చార్జీలు వ‌సూలు చేయాల‌ని ఆర్‌బీఐ స‌రికొత్త‌గా దిశా నిర్దేశం చేసింది. అంతేకాదు.. చెల్లించాల్సిన మొత్తాన్ని గ‌డువు దాటిన మూడు రోజుల‌కు కూడా క‌ట్ట‌ని స‌మ‌యంలో మాత్ర‌మే.. వారిపై అద‌న‌పు చార్జీలు విధించాల‌ని సూచించింది.

అంతేకాదు.. 90 రోజులు పాటు.. ఎలాంటి చెల్లింపులు జ‌ర‌ప‌ని ఖాతాల‌ను మాత్ర‌మే మొండి బ‌కాయిల ఖాతాలుగా గుర్తించాలంది. దేశంలో 2.12 కోట్ల క్రెడిట్ కార్డు ఖాతాలు ఉన్నాయ‌ని.. తాజాగా ఆర్ బీఐ చేసిన సూచ‌న‌లు కార్డు వాడే వారికి కొంత సౌల‌భ్యంగా ఉండ‌టంతో పాటు.. బ్యాంకులు ఎడాపెడా చార్జీలు విధించ‌టానికి అవ‌కాశం ఇవ్వ‌ని విధంగా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Tags:    

Similar News