మ‌త్తు వీడ‌కుంటే కాంగ్రెస్‌ కు క‌ష్ట‌కాల‌మే!

Update: 2020-02-25 00:30 GMT
ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్....స్వ‌తంత్రానికి పూర్వం స్థాపించిన పార్టీ....130 ఏళ్ల ఘ‌న‌చ‌రిత్ర క‌లిగిన పార్టీ......దేశానికి ఎంద‌రో కీల‌క‌మైన నేత‌ల‌ను అందించిన పార్టీ.....అయితే, గ‌త చ‌రిత్ర ఘ‌నంగా ఉన్న ఈ పార్టీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం చుక్కాని లేని నావ‌లా త‌యారైంది. కాంగ్రెస్‌ను న‌డిపించే బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేక పార్టీ కుదేల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల వార‌సత్వాన్ని తాను కొన‌సాగించ‌లేనంటూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు స‌సేమిరా అంటున్న వైనం కాంగ్రెస్ లీడ‌ర్స్‌, కేడ‌ర్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. వ‌యోభారంతో మ‌రోసారి అధ్య‌క్షురాలయ్యేందుకు సుముఖ‌త చూప‌క‌పోవ‌డం....రాహుల్‌ను కాద‌ని ప్రియాంకాకు ప‌గ్గాలు అప్ప‌జెప్పేందుకు సోనియా సుముఖంగా లేక‌పోవ‌డం....ఇవ‌న్నీ కాంగ్రెస్ నాయ‌క‌త్వంతోపాటు కార్య‌క‌ర్త‌ల‌ను ఉలికిపాటుకు గురిచేస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే సాధ్య‌మైనంత త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపించే నాయ‌కుడో...నాయకురాలో రాకుంటే పార్టీ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంద‌న్న అభిప్రాయ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం త‌ర్వాత సొంత పార్టీ నేత‌లే ఆప్ గెలుపును ప్ర‌శంసించ‌డంతో కాంగ్రెస్‌లో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప‌క్క పార్టీల‌ను పొగ‌డ‌డం మానేసి....సొంత పార్టీ ఓట‌మి ని విశ్లేషించాల‌ని చిదంబ‌రం వంటి సీనియ‌ర్ నేత‌ల‌కు జూనియ‌ర్ నేత‌లు చుర‌క‌లంటించారు. ఢిల్లీ ఓట‌మి త‌ర్వాత కాంగ్రెస్ అధిష్టానంలోనూ క‌ల‌వ‌ర‌పాటు మొద‌లైంది. మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ నానాటికీ బ‌ల‌ప‌డుతోంటే....నావికుడు లేని నౌక లాగా కాంగ్రెస్ అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. నావికుడు లేని నౌక‌....నాయ‌కుడు లేని పార్టీ...ఎక్కువ కాలం మ‌నుగ‌డ సాగించ‌లేవు. చుక్కాని లేని నావ‌లా ప‌య‌నిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసేవారు కూడా క‌రువ‌య్యారంటే అతిశ‌యోక్తి కాదు.

వీలైనంత త్వరగా నాయకత్వ సమస్యను పరిష్కరించ‌కుంటే పార్టీకి భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శశిథరూర్ కూడా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్‌ కు ఇష్టం లేకుంటే వేరెవ‌రినైనా అధ్య‌క్షుడిగా త‌క్ష‌ణ‌మే నియ‌మించ‌కుంటే పార్టీ మనుగడే ప్ర‌మాదం లో ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. సీఏఏ, ఎన్నార్సీల నేప‌థ్యంలో బీజేపీపై ప్ర‌జ‌ల్లో కొద్దిగా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. క‌నీసం ఆ నిర‌స‌న‌ల‌కు తీవ్ర‌ స్థాయిలో మ‌ద్ద‌తిచ్చే ప‌రిస్థితి లో కాంగ్రెస్ లేద‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. ఈ వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకొని మైలేజ్ పెంచుకునేందుకు స‌రైన నాయ‌కుడు లేడ‌న్న‌ది క‌ఠోర వాస్త‌వం. క‌నీసం, కాంగ్రెస్ అధిష్టానం ఇప్ప‌టికైనా మేలుకోకుంటే 2024లో దుకాణం బంద్ అవుతుంద‌ని సొంత పార్టీ నేత‌లు క‌క్క‌లేక మింగ‌లేక ఉన్నారు. మ‌రి, ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా తీసుకునే నిర్ణ‌యంపై కాంగ్రెస్ భ‌విష్య‌త్తు ఆధార‌ ప‌డుతుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీ భార‌త రాజ‌కీయ సంద్రంలో టైటానిక్‌లాగా మునిగిపోక త‌ప్ప‌దు! మ‌త్తు వీడ‌కుంటే కాంగ్రెస్‌కు క‌ష్ట‌కాల‌మే!
Tags:    

Similar News