1995లో కారు రిపేరుకు డబ్బుల్లేవు.. మరి ఇప్పుడో..?

Update: 2021-01-14 23:30 GMT
ప్రపంచంలో అద్భుత విజయాల్ని సాధించిన చాలామంది జీవితాలు సాదాసీదాగానే ప్రారంభమయ్యాయి. ఆ విషయం మరోసారి నిజమని తేలింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానంలో ఉన్న ఎలన్ మస్కకు.. సరిగ్గా పాతికేళ్ల క్రితం అతనికి కారు రిపేరు చేయించుకోవటానికి కూడా డబ్బుల్లేని పరిస్థితుల్లో ఉండేవారు. కట్ చేస్తే.. ఇప్పుడాయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

తాజాగా ఎలన్ మాస్క్ కు సంబంధించిన ఒక ఫోటోను ప్రణయ్ పాతోల్ అనే వ్యక్తి ట్విటర్ లో పోస్టు చేవారు. ఒక కారుకు రిపేర్ చేస్తున్న ఫోటోను 1995లో తీసినట్లుగా డేట్ మార్కు చెబుతోంది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన వ్యక్తి.. ఆ ఫోటో వివరాల్ని వెల్లడిస్తూ.. ఎలన్ మాస్క్ తన కారు రిపేరుకు డబ్బులు చెల్లించే స్థోమత లేక తానే మరమ్మతులు చేసుకుంటున్నట్లుగా వెల్లడించారు. దీనికి స్పందించిన ఎలన్ మాస్కు.. ‘కారు గ్లాస్ మార్చటం కోసం మరో గ్లాసును జంక్ యార్డు (పాత కార్లను తుక్కుగా వేసే ప్రాంతం) లో 20 డాలర్లకు కొన్నాను. కారుకు సంబంధించి విడి భాగాల్ని కొనుగోలు చేయటానికి అదే మంచి చోటు అని పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ ఫోటోను రెండేళ్ల క్రితం ఎలన్ మాస్క్ తల్లి మాయో మాస్క్ పోస్టు చేశారు. దానికి స్పందించిన ఎలన్ తన గతాన్ని గుర్తు చేసుకొని.. అందరికి షేర్చేశారు. అప్పట్లో తన దగ్గర కారు రిపేరుకు డబ్బులు ఉండేవి కాదని.. అందుకే కారుకు ఉన్న సమస్యలకు సమాధానంగా వస్తువుల్ని జంక్ యార్డులో తక్కువ ధరకు కొనుగోలు చేసేవాడినని పేర్కొన్నారు. 1993లో 1400 డాలర్లు ఖర్చు చేసి.. బీఎండబ్ల్యూ 320ఐ మోడల్ (1978నాటిది)కారును కొనుగోలు చేశారు. దానిని రిపేరు చేసుకుంటూ ఫోటో దిగారు.

ఎలన్ మాస్కు 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆయన తండ్రి ఎలక్ట్రో మెకానికల్ ఇంజినీర్. పైలెట్.. స్థిరాస్తి వ్యాపారి కూడా. తల్లి మోడల్ కమ్ డైటీషియన్. ఎలన్ కుటుంబం మొదట్నించి ఎగువ మధ్యతరగతి కుటుంబమేనని చెబుతారు. 1995లో తన సోదరుడితో పాటు మరో వ్యక్తితో కలిపి జిప్ 2 అనే ఐటీ కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత ఎక్స్ డాట్ కామ్.. పేపాల్.. స్పేస్ ఎక్స్.. టెస్లా ఇలా అనేక కంపెనీల్ని స్టార్ట్ చేసి.. వేలాది కోట్లు సంపాదించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా నిలిచారు.
Tags:    

Similar News