ఖైర‌తాబాద్ గ‌ణేశుడి చేతిలో ఈ సారి ల‌డ్డూ లేదే!

Update: 2017-08-14 10:28 GMT
ఉమ్మ‌డి రాష్ట్రంలో హైద‌రాబాద్‌లోని ఖైర‌తాబాద్ గ‌ణేశుని విగ్ర‌హానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో అప్ప‌ట్లో అతి పెద్ద భారీ విగ్ర‌హం అక్క‌డే ఏర్పాట‌య్యేది. అక్క‌డే నిర్మించి.. అక్క‌డే పూజించ‌డం ఇక్క‌డ ఆన‌వాయితీ.  ఏటికేడు ఎత్తును పెంచుకుంటూ..  50 అడుగుల ఎత్తు వ‌ర‌కు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అంత పెద్ద విగ్ర‌హం చేతిలో ల‌డ్డూ లేక‌పోవ‌డం అంద‌రినీ క‌లిచివేసింది. ఈ క్ర‌మంలోనే తూర్పుగోదావ‌రికి చెందిన సురుచి ఫుడ్స్ అదినేత మ‌ల్లిబాబు బ‌డా గ‌ణేశ్ చేతిలో బ‌డా ల‌డ్డూ ఉండాల్సిందేన‌ని ఉత్స‌వాల అనంత‌రం దానిని అంద‌రూ ప్ర‌సాదంగా స్వీక‌రించ‌డం ద్వారా ఉత్స‌వాల‌కు మ‌రింత వ‌న్నె వస్తుంద‌ని భావించారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న తొలిసారిగా 2010 నుంచి ఖైరతాబాద్‌ గణేశుడి కోసం భారీ లడ్డూను నైవేద్యంగా పంపుతున్నారు. ఏటికేడు లడ్డూ బరువును పెంచుకుంటూ.. 2015లో ఏకంగా 6 వేల కేజీల లడ్డూను పంపించారు మల్లిబాబు. అయితే.. గణేష్ ఉత్సవాల అనంతరం మల్లిబాబు తాను సమర్పించిన లడ్డూలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకునేవారు. మిగతా లడ్డూను నిర్వాహకులు భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేవారు.  ఈ ల‌డ్డూ ప్ర‌సాదాన్ని తీసుకునేందుకు హైద‌రాబాద్ మొత్తం క‌దిలి వ‌చ్చి ఖైర‌తాబాద్‌ లో క్యూ క‌ట్టేది!

అయితే, 2013లో ఈ ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో సమస్య మొదలైంది. అప్పట్లో 4,200 కిలోల లడ్డూను మల్లిబాబుకు పంపించగా, గణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత మల్లిబాబుకు కొంత ఇచ్చి.. మిగతాది భక్తులకు పంచాలని నిర్ణయించారు. అయితే లడ్డూ పంపిణీలో వాటాపై కమిటీ సభ్యుల్లో గొడవ జరగడంతో పోలీసులు పంపిణీని నిలిపేశారు. ఇంతలో భారీ వర్షం పడటంతో లడ్డూ కాస్తా చెడిపోయింది. దీంతో మ‌ల్లి బాబు ఉసూరుమ‌న్నారు. అనంత‌రం ఆ ల‌డ్డూను తీసుకువెళ్లి హుస్సేన్ సాగర్‌లో క‌లిపేశారు.

మ‌రో సంద‌ర్భంలోఅంటే.. 2015లో మల్లిబాబు తనవంతుగా తీసుకున్న లడ్డూను తాపేశ్వరానికి తరలిస్తుండగా కొందరు దౌర్జన్యం చేసి లడ్డూ ప్రసాదాన్ని బలవంతంగా మ‌ధ్య‌లోనే ప‌ట్టుకుపోయారు. ల‌డ్డూ త‌యారీకి క‌నీసం రెండు నెల‌ల ముందు నుంచి పెద్ద ఎత్తున అన్నీ స‌మ‌కూర్చుకుని మ‌ల్లిబాబు ఏర్పాట్లు చేసేవారు .అంద‌రూ దీక్ష తీసుకుని ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి దీనిని త‌యారు చేసేవారు. అలాంటి ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో 2016లో  ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఇక నుంచి లడ్డూను తీసుకురావద్దని మల్లిబాబుకు చెప్పారు.  దాని త‌యారీకి అయ్యే ఖ‌ర్చును కూడా తాము ఇవ్వ‌బోమ‌న్నారు.

అయిన‌ప్ప‌టికీ.. మ‌ల్లిబాబు.. ఆ గ‌ణేశునిపై భ‌క్తితో ఆ ఏడాది కూడా 500 కిలోల లడ్డూను తెచ్చి.. గణపతి పాదాల వద్ద సమర్పించారు. అయితే, నిమజ్జనం అయ్యాక ఆ లడ్డూలో రవ్వంత కూడా మల్లిబాబుకు ఇవ్వ‌లేదు. దీనిపై గ‌ణేశ్ కమిటీ మౌనం వ‌హించింది. ఈ ప‌రిణామం మ‌ల్లిబాబును తీవ్రంగా బాధించింది.  తాము ఎంతో క‌ష్ట‌ప‌డి ల‌డ్డూ పంపుతుంటే అక్క‌డివారు చుల‌క‌న‌గా భావిస్తున్నార‌ని ఆయ‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ల‌డ్డూను పంప‌రాద‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, అదేస‌మ‌యంలో విశాఖ‌లో ఏర్పాటు చేసే భారీ గ‌ణ‌ప‌తికి మాత్రం య‌ధావిధిగా భారీ ల‌డ్డూను పంపాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.
Tags:    

Similar News