సొంత మీడియా వద్దు: రాష్ట్రాలకు మోడీ సర్కార్ షాక్

Update: 2022-10-22 10:30 GMT
ఎవరి మటుకు వారు సొంత  చానళ్లను ఏర్పాటు చేసుకుని తమ కంటెంట్ ని ప్రసారం చేసుకునే తీరు  ఇక మీదట చెల్లదని కేంద్ర ప్రభుతం స్పష్టం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రాలు కానీ కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ సొంత చానళ్లు  కలిగి ఉండే పరిస్థితిని ఇక మీదట అంగీకరించమని కూడా పేర్కొంది.

అదే విధంగా ఎవరికి వారుగా సొంతగా మీడియా చానళ్ళు పెడితే పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలతో అయోమయం ఏర్పడుతుంది అని కూడా ట్రాయ్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు దేశమంతటా కేంద్ర ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ మాత్రమే ప్రభుత్వ ప్రసారాలను చేస్తుందని కూడా స్పష్టం చేశారు. అంటే ఏ రాష్ట్రమైనా తన మీడియా చానళ్ళ ద్వారా సేకరించిన కంటెంట్ ని కూడా కేంద్రానికి చెందిన దూరదర్శన్ ద్వారానే ప్రసారం చేసుకోవాలని కోరింది.

ఈ విధానానికి దేశమంతా రావాలని పేర్కొంటూ డెడ్ లైన్ గా వచ్చే ఏడాది డిసెంబర్ 23 వరకూ గడువు ఇచ్చింది. ఈ విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సులతొ పాటు,  క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును కూడా దృష్టిలో ఉంచుకున్నారు. అలాగే, న్యాయ శాఖ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సూచన చేసినట్లు కేంద్రం పేర్కొంది.

దీంతో ఏపీ, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాలకు షాక్ తగిలినట్లు అయింది అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఐపీటీపీని నడుపుతోంది. అలాగే, తమిళనాడులో కల్వీ టీవీ , అరసు కేబుల్ కూడా సర్కార్ తరఫున నడుస్తున్నాయని అంటున్నారు.  కేంద్రం నిర్ణయంతో ఇవి మూతపడాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా చాలా రాష్ట్రాలు తమకు సొంతగా మీడియా సంస్థ ఉండాలని ఇప్పటికే కేంద్రానికి అభ్యర్ధలను పెట్టుకున్నాయి. అవి వివిధ దశలలో పరిశీలనలో ఉన్నాయి.

ఈ తాజా నిర్ణయంతో అవి పూర్తిగా పక్కకు పోయినట్లే అంటున్నారు. అయితే కేంద్రం ఈ విధంగా కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్రాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అదే విధంగా ఇప్పటికే కేంద్రం ఏకస్వామ్యం పెరిగిపోతోంది అని పలు రాష్ట్రాలు మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి.

ఈ లేటెస్ట్ నిర్ణయంతో మోడీ వర్సెస్ రాష్ట్రాలు అన్నట్లుగా పరిస్థితి మారుతుందా అంటే చూడాలి. ఏది ఏమైనా విధానపరమైన నిర్ణయం, పైగా న్యామ సలహాలు సూచనలతో అని చెబుతున్నారు కాబట్టి కేంద్రం డెసిషన్ ఫైనల్ అనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News