పార్టీ లేదు... బొక్కా లేదు... బొకే కూడా లేదు...ఏంటిదీ...?

Update: 2022-08-06 11:30 GMT
తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అంతా చెప్పుకుంటారు. దేశంలో సుదీర్ఘ కాలంగా ఉంటున్న అతి కొద్ది పార్టీలలో టీడీపీ ఒకటి. ఇక ఈ మధ్యనే నాలుగు దశాబ్దాల పండుగను మహానాడు వేదికగా టీడీపీ చేసుకుంది. ఆ పార్టీ 2019 ఎన్నికల్లో దారుణంగా అపజయం పాలు అయింది. మరో పార్టీ అయితే ఈపాటికి తట్టాబుట్టా సర్దుకునేదే. కానీ గ్రాస్ రూట్ లెవెల్ లో పటిష్టమైన క్యాడర్ బలం ఉన్న పార్టీ కాబట్టి టీడీపీకి ఎన్ని దెబ్బలు పడినా లేవగలుగుతోంది.

అంతవరకూ ఎందుకు 2019 ఎన్నికల్లో సీట్లు తగ్గాయి కానీ ఓట్ల షేర్ మాత్రం 39 శాతంగా ఉంది. ఇక మూడేళ్ళ కాలంలో టీడీపీ బాగా నిలదొక్కుకుంది. రేపటి రోజున ఎన్నికలు జరిగితే అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కూడా ఉంది. కానీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం కొన్ని సార్లు  ఎబ్బెట్టుగా మరికొన్ని సార్లు ఏవగింపుగా తమ్ముళ్ళకు తోస్తున్నాయి అంటే ఎక్కడో ట్రబుల్స్ ఉన్నాయి వాటిని రిపేర్ చేసుకోకతప్పదనే అంటున్నారు.

గత ఏడాది తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న వేళ ఒక హొటల్ లో టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మాట్లాడినట్లుగా వచ్చిన ఒక వీడియో అయితే టీడీపీ పరువు తీసేలాగానే ఉంది మరి. అది తన వీడియో కాదు అని ఆయన చెప్పినప్పటికీ అందులో ఆయన అన్నారని వచ్చిన మాటలు తెగ  వైరల్ అయ్యాయి.  పార్టీ ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేశాయి . అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్కా లేదు అంటూ ఘాటుగా మాట్లాడిన మాటలు చూస్తే టీడీపీ తమ్ముళ్ళ గుండె జారినంత పనైంది.

అయితే ఇపుడు అదే అచ్చెన్నాయుడు తాను అలా అనలేదని చెప్పి టీడీపీయే అధికారంలోకి వస్తుందని రోజుకు పదిసార్లు గర్జిస్తున్నారు అనుకోండి. అది వేరే విషయం. అయినా సొంత పార్టీలో సీనియర్లు అందునా ముఖ్య బాధ్యులు ఇలా మాట్లాడడం అంటే తమ్ముళ్ళు షాక్ తింటే వైసీపీకి అది ఆయుధం అయింది. ఈ రోజుకీ వైసీపీ వారు అదే మాటను పట్టుకుని బాగా తిప్పుతారు. ఇక ఇపుడు అలాంటిదే మరో ఇష్యూ.

వెళ్లక వెళ్ళక చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మోడీ కరుణ దలచి ఒక జాతీయ స్థాయి కమిటీ మీటింగునకు పిలిస్తే బాబు వెళ్లారు. ఒక విధంగా టీడీపీకి ఇది మంచి సంకేతం అని అంతా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు బోకే ఇవ్వాలంటూ పార్టీ నేత గల్లా జయదేవ్ మరో ఎంపీ కేశినేని నానికి దాన్ని తెచ్చి ఇస్తే ఆయన దురుసుగా ముందుకు తోయడం కెమెరాల్లోకి ఎక్కేసింది. ఇపుడు ఆ వీడియో సోషల్ మీడియాలో  బాగా చక్కర్లు కొడుతోంది.

అంటే అధినాయకుడు చంద్రబాబుకు బోకే ఇవ్వడం కూడా కేశినేని నానీ ఇష్టం లేదా అన్న చర్చ మొదలైంది. ఆయనకు కోపం ఉంటే ఉండవచ్చు కానీ ఇలా మరీ బహిరంగగా అధినాయకుడు పరువుని తీయడమేంటని కూడా అంతా అంటున్నారు. దీంతో ఈ ఆయుధం కూడా వైసీపీ తీసుకుంది. పార్టీ లేదు బొక్కా లేదు, బొకే కూడా లేదు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెడుతున్న పోస్టులు ఇపుడు టీడీపీ తమ్ముళ్ళకు మంట పుట్టించేలా ఉన్నాయి.

ఏ పార్టీలో అయినా విభేదాలు సహజం. అయితే వాటిని నాలుగు గోడల మధ్యన పరిష్కరించుకోవాలి. అంతే తప్ప రోడ్డెక్కకూడదు, గతంలో కాంగ్రెస్ లో మాత్రమే ఈ కల్చర్ ఉండేది. ఇపుడు టీడీపీలో కూడా ప్రవేశించింది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవర్ లోకి రావాలనుకుంటున్న టీడీపీకి ఇలాంటివే డ్యామేజ్ చేస్తాయని చెబుతున్నారు. బాబు లాంటి దిగ్గజ నేతకే సొంత పార్టీ నేతల నుంచి ఇలాంటివి ఎదురవుతున్నాయంటే  రానున్న రోజులలో లోకేష్ లాంటి వారు వస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్టీ తరువాత లీడర్  అన్న కల్చర్ అయితే ఇపుడు దేశంలో ఏ పార్టీలో లేదు ఉన్నంతలో బీజేపీ కామ్రేడ్స్ ఈ విషయంలో మెరుగు.
Tags:    

Similar News