జనతా కర్ఫ్యూ..ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్

Update: 2020-03-20 16:39 GMT
కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 22వ తేదీ ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ  విధించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని మోడీ పిలుపునిచ్చారు.  ప్రజలందరూ 14 గంటల పాటు ఇళ్లకే పరిమితం కావాలని మోడీ సూచించారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న వైద్య - పారిశుద్ధ్య - విమానయాన - మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా మార్చి 22న జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుతో జనతా కర్ఫ్యూ నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటికే ప్రయాణం ప్రారంభించిన రైళ్లు - మార్గమధ్యంలో ఉన్న రైళ్లు గమ్యాలను చేరడానికి అనుమతిస్తామని రైల్వేశాఖ తెలిపింది. ఢిల్లీ మెట్రో - బెంగళూరు మెట్రో నిలిపేస్తున్నట్లు ఆయా రైల్వే జోన్లు ఇప్పటికే ప్రకటించాయి.

దీంతోపాటు - ముంబై - చెన్నై - కోల్‌ కతా - ఢిల్లీ -సికింద్రాబాద్‌ ల్లో సబర్బన్ సర్వీసులను కూడా తగ్గిస్తున్నామని.. అవసరమున్న ప్రయాణికుల కోసం తక్కువ సంఖ్యలో సర్వీసులు నడుపుతామని పేర్కొంది. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా 2400 రైళ్లు నిలిచిపోనున్నాయి. వీటిలో 1300 దూరం వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే రైల్వే శాఖ 245 రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రైళ్ల రద్దుతో రైల్వే వాఖకు దాదాపు రూ.450 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. దీనికితోడు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో రైల్వే శాఖ తీవ్రంగా నష్టపోతోంది. తాజాగా, జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆ శాఖ మరింత నష్టపోనుంది. కాగా, కేరళలో ఆదివారం నాడు రాష్ట్ర రవాణా కార్పొరేషన్‌ బస్సులు తిరగవని - ఇతర ప్రజా రవాణా వ్యవస్థను కూడా నిలిపివేస్తున్నామని సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. మెట్రో సర్వీసులు కూడా ఆరోజు అందుబాటులో ఉండవని తెలిపారు.



Tags:    

Similar News