హైద‌రాబాద్ రోడ్ల మీద ప్రైవేటు బ‌స్సుల‌కు నో!

Update: 2018-03-27 06:22 GMT
పాల‌కులు ఎన్ని మాట‌లు చెప్పినా.. హైద‌రాబాద్ ట్రాఫిక్ జాంల‌ను నిరోధించ‌టంలో మాత్రం ప్ర‌భుత్వం అడ్డంగా ఫెయిల్ అయ్యింద‌ని చెప్పాలి. తాము అధికారం చేప‌ట్టిన వేళ‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ ట్రాఫిక్  స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెబుతూ వ‌చ్చినా.. ఇప్ప‌టివ‌ర‌కూ చేసిందేమీ లేదు.  ట్రాఫిక్ జాంల‌కు చెక్ చెప్పేందుకు వీలుగా తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.

మీరు గ‌మ‌నించారో లేదో.. రాత్రి 9 గంట‌ల త‌ర్వాత నుంచి బీహెచ్ ఈఎల్ మొద‌లు వ‌న‌స్థ‌లిపురం వ‌ర‌కూ ప్రైవేటు బ‌స్సుల హ‌డావుడి ఎంత ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇక‌.. బెంగ‌ళూరు వెళ్లే బ‌స్సుల విష‌యానికి వ‌స్తే.. అత్తాపూర్ రూట్ మొత్తం బిజీబిజీగా ఉంటుంది.

దీంతో.. భారీ ట్రాఫిక్ జాంలు త‌ర‌చూ చోటు చేసుకోవ‌టం.. ర‌హ‌దారులు కిట‌కిట‌లాడ‌టం తెలిసిందే. ప్ర‌తి స్టాపులో బ‌స్సులు ఆప‌టం.. ప్ర‌యాణికుల కోసం రోడ్డుకు ఒక‌వైపు పెద్ద ఎత్తున బ‌స్సులు ఆగిపోవ‌టంతో ట్రాఫిక్ స్లో కావ‌టం.. అది కాస్తా కాసేప‌టికే ట్రాఫిక్ జాంగా మార‌టం తెలిసిందే. ఏళ్ల‌కుఏళ్లుగా ఈ స‌మ‌స్య ఉన్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ దీనికి ప‌రిష్కారం క‌నుగొన్న‌ది లేదు.

ఒక అంచ‌నా ప్ర‌కారం.. రోజుకు త‌క్కువలో త‌క్కువ 500-600 బ‌స్సులు హైద‌రాబాద్ నుంచి బెజ‌వాడ వైపు.. బెంగ‌ళూరువైపు వెళుతున్నాయ‌న్న‌ది అన‌ధికారికంగా చెబుతుంటారు.  దీనికి సొల్యూష‌న్ విష‌యంలో కిందామీదా ప‌డిన అధికారులు ఇప్పుడు స‌రికొత్త ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ఇక‌పై ప్రైవేటు బ‌స్సులేవీ మొయిన్ రోడ్ల మీద రాకుండా అవుట‌ర్ రింగు రోడ్డు ద్వారా ప్ర‌యాణిస్తాయి. మ‌రి.. ప్ర‌యాణికుల మాటేమిటంటే.. ఇప్పుడున్న ప్ర‌ధాన స్టాపుల్లో మినీ బ‌స్సుల ద్వారా అవుట‌ర్ రింగు రోడ్డు ద‌గ్గ‌ర‌కు చేరుస్తాయి. అక్క‌డి నుంచి ప్రైవేటు బ‌స్సుల్లో త‌మ గ‌మ్య‌స్థానాల‌కు బ‌య‌లుదేర‌తార‌న్న మాట‌.

ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ‌ప‌ట్నం వెళ్లేందుకు అమీర్ పేట‌లో బ‌స్సు  ఎక్కాల్సిన వారిని.. అమీర్ పేట‌లో మినీ బ‌స్సులో తీసుకొని.. అవుట‌ర్ రింగ్ రోడ్డు ఎండ్ పాయింట్ (హ‌య‌త్ న‌గ‌ర్‌) ద‌గ్గ‌ర‌కు తీసుకెళ‌తారు. అక్క‌డ బ‌స్సును మారి.. తాము ఎక్కాల్సిన బ‌స్సు ఎక్కేస్తారు. దీంతో.. హైద‌రాబాద్ ప్ర‌ధాన రోడ్ల మీద భారీ ఎత్తున ట్రాఫిక్ జాం ల బెడద త‌ప్పుతుంద‌ని చెబుతున్నారు. ఈ ప్ర‌తిపాద‌న కార్య‌రూపం దాల్చి.. స‌మ‌ర్థంగా అమ‌లు చేసిన ప‌క్షంలో హైద‌రాబాద్ రోడ్ల మీద రాత్రిళ్లు అయ్యే ట్రాఫిక్ జాంకు చెక్ పెట్టొచ్చ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News