రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేసుకున్నా 'నో ప్రాబ్లమ్' కానీ .. !

Update: 2021-05-28 06:40 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.  దేశంలో లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు , వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే దేశంలో వ్యాక్సిన్ల కొరత కూడా చాలా తీవ్రంగా వేధిస్తోంది. అయితే , ఉన్నంతలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. అయితే , ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఓ పొరపాటు కొన్ని కొన్ని సార్లు ఉత్పన్నం అవుతోంది. తోలి డోసు ఓ వ్యాక్సిన్ తీసుకున్న వారు , రెండో డోసు వ్యాక్సిన్ ఇంకో సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను తీసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేంద్రం తాజాగా స్పందించింది. తొలి డోసు ఒకటి, రెండో డోసు వేరే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తీవ్ర దుష్ప్రబావాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది.

అయితే, ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఆరోగ్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేయడం అనేది పరిశీలించాల్సిన విషయమని , దీనిపై శాస్త్రీయ అవగాహన కోసం మరింత సమయం వేచిచూడాలి. కానీ, ఇలా వేర్వేరు టీకాలు తీసుకున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. తీవ్ర ప్రతికూల ప్రభావాలు సంభవించకపోవచ్చని, అయినప్పటికీ వీటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆరోగ్య సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని అన్నారు. నిబంధనల ప్రకారం.. తొలి డోసు తీసుకున్న వ్యాక్సినే రెండో డోసులో ఇవ్వాలని పాల్ స్పష్టం చేశారు.

కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ్ నగర్‌లో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి రెండో డోసుకు వచ్చిన వారికి తొలి డోసులో వేసిన వ్యాక్సిన్ కాకుండా ఇంకో వ్యాక్సిన్ ఇచ్చారు. తొలుత కోవిషీల్డ్ తీసుకున్న 20 మందికి రెండో డోసులో కోవాగ్జిన్ ఇచ్చారు. ఆ తర్వాత పొరపాటును గుర్తించిన అధికారులు, అలా తీసుకున్న వారిని ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. అయితే, వారిలో ఇప్పటి వరకు ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడం లేదని , మరోవైపు ఇలా వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవడంపై అంతర్జాతీయంగానూ పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫైజర్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లపై ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు జరుపుతోంది. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో ఎలాంటి దుష్ప్రభావాలు బయటపడనప్పటికీ, పూర్తి ఫలితాలు మరింత సమయం పడుతుందని అంటున్నారు.
Tags:    

Similar News