అమ‌రావ‌తికి పంగ‌నామం పెట్టిన బీజేపీ ప్ర‌భుత్వం!

Update: 2021-03-04 08:30 GMT
రాష్ట్ర‌ విభ‌జ‌న‌కు యూపీఏ ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డితే.. మంత్ర‌సాని అవ‌తారం ఎత్తింది బీజేపీ. అంతేకాదు.. విభ‌జ‌న వ‌ల్ల న‌వ్యాంధ్ర‌కు తీవ్ర న‌ష్టం క‌లుగుతోంద‌ని, అందువ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వం న్యాయం చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. పార్ల‌మెంట్ సాక్షిగా దేశం మొత్తం చూస్తుండ‌గా.. ప్ర‌త్యేక హోదాపై ప్ర‌ధాని మన్మోహ‌న్ తో బేరాలు ఆడింది కాషాయ పార్టీ. మ‌న్మోహ‌న్ ఐదు సంవ‌త్స‌రాలు అంటే.. కాదు కాదు.. ప‌దేళ్లు ఇవ్వాల్సిందేన‌ని నాటి బీజేపీ నేత‌గా వెంక‌య్య‌నాయుడు ప‌ట్టుబ‌ట్టారు!

ఆ విధంగా.. విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ద‌క్కాల్సిన న్యాయాన్ని చ‌ట్టం చేసేంత వ‌ర‌కూ ఊరుకోలేదు. ఆ త‌ర్వాత అధికారం మారింది. బీజేపీ ప్ర‌భుత్వంలోకి వ‌చ్చింది. దీంతో.. ఏపీకి విభ‌జ‌న‌ చ‌ట్టం ప్ర‌కారం ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నాల‌న్నీ అందుతాయ‌ని భావించారు ప్ర‌జ‌లు. కానీ.. తాము చేసింది రాజ‌కీయం మాత్ర‌మేన‌ని, త‌మ‌కు చిత్త‌శుద్ధి లేద‌ని బ‌హిరంగంగా చాటుకుంది న‌రేంద్ర‌మోడీ స‌ర్కారు!

ఎన్నో కొర్రీలు పెట్టి.. అత్యంత ప్ర‌ధాన‌మైన ప్ర‌త్యేక హోదాకు మంగ‌ళం ప‌లికింది. దీంతో.. పార్ల‌మెంట్ సాక్షిగా చేసిన చ‌ట్టానికి విలువ లేకుండా పోయింది. కేంద్రం అంద‌రూ చూస్తుండ‌గా మాట త‌ప్పింది. ఇప్పుడు.. విభ‌జ‌న చ‌ట్టంలోని మ‌రో అంశాన్ని కూడా పాత‌రేసింది. అమ‌రావ‌తిలో రైల్వే స్టేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని చ‌ట్టంలో పొందు పరిచిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు కుద‌ర‌ద‌ని ప్ర‌క‌టించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేద‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి.. అమ‌రావ‌తికి తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి రైల్వే లైన్ ను ప్ర‌తిపాదించారు. ఎర్రుపాలెం నుంచి అమ‌రావ‌తి మీదుగా నంబూరు వ‌ర‌కు 28 కిలోమీట‌ర్ల సింగిల్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాద‌న‌లు రూపొందించారు. కృష్ణాజిల్లాలోని పెద్దాపురం, చిన్నారావు పాలెం, గొట్టుముక్క‌ల‌, ప‌రిటాల‌, కొత్త‌పేట‌. వ‌డ్డ‌మాను, అమ‌రావ‌తి, తాడికొండ‌, కొప్ప‌వ‌రం, నంబూరు వ‌ర‌కు రైలు ప్ర‌యాణించాల్సి  ఉంది. ఇదేకాకుండా.. అమ‌రావ‌తి నుంచి పెద‌కూర‌పాడు వ‌ర‌కు 25 కిలోమీర్లు, స‌త్తెన‌ప‌ల్లి నుంచి న‌ర‌సారావుపేట వ‌ర‌కు 25 కిలోమీట‌ర్ల వ‌ర‌కు కూడా సింగిల్ రైల్వే లైన్ ను ప్ర‌తిపాదించారు.

కానీ.. ఈ ప్ర‌తిపాద‌న‌ను ఇప్పుడు ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలోనూ  రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ అన‌వ‌స‌ర‌మ‌ని బీజేపీ స‌ర్కారు తేల్చేసింది. దీంతో.. కేంద్రం తీరుపై తెలుగు రాష్ట్రాల నుంచి తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News