ఒక తల్లికి ఇంతకుమించిన గిఫ్టు ఏ కొడుకు మాత్రం ఇవ్వగలడు

Update: 2022-12-28 23:30 GMT
ఒక చిన్న పిల్లాడు. వాళ్ల అమ్మకు ఆ పిల్లాడ్ని పెద్ద పైలెట్ చేయాలన్నది కోరిక. అందుకే.. నువ్వు పెద్ద అయ్యాక పైలెట్ కావాలని కోరుకునేది. అలా అంటే నిర్లక్ష్యం చేస్తాడనుకున్నదో ఏమో కానీ.. నువ్వు పైలెట్ అయి.. నన్ను నీ విమానంలో మక్కాకు తీసుకెళతావా? అని అడిగేది. మరి.. ఆ పిల్లాడు ఇప్పుడెక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అన్నది తెలుసుకోవటానికి ముందు.. మరికాస్త చదవాల్సిందే.

బాల్యం గుర్తుకు వచ్చిన ప్రతిసారీ పెదాల మీద నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటుంది. చిన్న ప్రపంచంలో అమ్మ..నాన్న.. కుటుంబసభ్యులు తప్పించి ఇంకెవరు ఉండరు. అలాంటి రోజుల్లో అమ్మ కలల్ని తీర్చటమే పనిగా పెట్టుకునే పిల్లల్ని చాలామందిని చూస్తుంటాం. అమ్మ ఆకాంక్షను తీర్చటం కోసం అందుకు తగ్గట్లుగా తన కెరీర్ ను మలుచుకోవటం.. ఆమె కోరుకున్నట్లే చేయటం అంత తేలికైన విషయం కాదు.

అలాంటిది చేసి.. చిన్నప్పటి అమ్మ కోరుకున్నది ఎవరైనా కొడుకు చేయగలిగితే అంతకు మించిన విజయం ఏముంటుంది? ఒకరి విజయం వారికి మాత్రమే ఆనందాన్ని ఇస్తే అదెలా గెలుపు అవుతుంది?  నిజానికి గెలుపు అంటే.. అందరి మనసుల్ని దోచుకోవటం.. చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తిగా నిలవటం.

అంతే తప్పించి మనతో పాటు వెంట రాని కోట్లాది రూపాయిలు ఎంతమాత్రం కాదు. తాజాగా అలాంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం. తాజాగా అమీర్ రషీద్ వానీ అనే వ్యక్తి పోస్టు చేసిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారటమే కాదు.. వేలాది మంది అతడి మాటలకు ఫిదా అవుతున్నారు. తీవ్రమైన భావోద్వేగానికి గురవుతున్నారు.

తాను స్కూల్ కు వెళ్లేటప్పుడు తన తల్లి  తనను పైలెట్ కావాలని కోరుకునేదని.. తన మెడలో ఒక బోర్డు వేలాడదీసేదని.. అందులో నువ్వు పైలెట్ అయ్యాక నన్ను నీ విమానంలో మక్కాకు తీసుకెళ్లు అని చెబుతుండేది.

ఈ రోజు మా అమ్మను పవిత్ర కాబా నగరమైన మక్కాకు ప్రయాణించే ఫ్లైట్ కు నేను పైలెట్ ను అని ట్వీట్ చేశాడు. అందులో తాను పైలెట్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్లేస్ ఫోటోతో పాటు.. చిన్నతనంలో తన తల్లి తన మెడలో ఉంచిన బోర్డుతో ఉన్న ఫోటోను కలిపి పోస్టు చేశాడు.

తల్లి కోరుకోవటం.. ఆ కోరికను తీర్చటం అందరికి సాధ్యం కాదు. అందునా.. తాను నడిపే విమానంలో తన తల్లి తన చిన్నతనంలో కోరుకున్నట్లే.. తానే విమానాన్ని నడుపుతూ.. మక్కాకు తీసుకెళుతున్న వైనం ఇప్పుడు అందరిని కదిలిస్తోంది. ''మీరు దృఢ సంకల్పంతో ఉంటే మీ కలలు నెరవేరుతాయి'' అని ఒకరు పేర్కొంటే.. మరొకరు.. ''మీరు మీ తల్లి కలను నెరవేర్చినందుకు మీరు నిజంగా లక్కీ'' అంటూ వందలాది మంది రియాక్టు అవుతున్నారు. నిజమే.. మనం కూడా మన తల్లిదండ్రులు మన చిన్నతనంలో మన నుంచి ఏం కోరుకున్నారు? వారికి మనం చేయాల్సిందేముంది? అన్నది ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుంటుంది కదా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News