రాజధానిలో గ్రామాలకు ముప్పు లేదు

Update: 2015-07-25 17:58 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతి సీడ్ కేపిటల్ ప్లాన్ ను విడుదల చేసిన తర్వాత.. అమరావతి రూపు రేఖా విలాసాలు బయటపడిన తర్వాత రాజధాని గ్రామాల్లో కొత్త ఆందోళన మొదలైంది. చంద్రబాబు పదే పదే చెప్పినట్లే అమరావతి అంతర్జాతీయ స్థాయిలో ఉండనుంది. దానిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మరి, అంత అద్భుత రాజధాని మధ్యలో మా గ్రామాలు ఉంటాయా? వాటిని కూడా తీసేస్తారా? గ్రామాలను సేకరించి తమను బయటకు గెంటేస్తారా? ఈ ఆందోళనలు ఇప్పుడు రాజధానివాసులను ముంచెత్తుతున్నాయి. అయితే, గ్రామాలకు ఎటువంటి ముప్పు లేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది.

రాజధాని పరిధిలోని తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెంలను నాలుగు భాగాలుగా విభజించారు. వాటిలో ప్రభుత్వ కార్యాలయాలు, డౌన్ టౌన్, గేట్ వే, వాటర్ ఫ్రంట్ ఉంటాయని ప్రతిపాదించారు. వీటిలోనే బొటానికల్ గార్డెన్, ఆహార శాలలు, కళా కేంద్రం వంటివి ఉన్నాయి. దాంతో రాజధాని వాసుల్లో ఆందోళన పెరిగింది. అయితే, సీడ్ కేపిటల్ ప్రణాళికలో మొత్తం 27 అంశాలను చూపించారని, వాటిలో లింగాయపాలెం, తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం గ్రామాలు అలాగే ఉన్నాయని, దానిని గుర్తించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆ మూడు గ్రామాలను మాత్రమే కాదని.. రాజధాని పరిధిలోని ఏ గ్రామాన్నీ కదిలించే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేస్తోంది. అందువల్ల, రాజధాని పరిధిలోని 29 గ్రామాలకూ ఎటువంటి ముప్పు లేనట్లే భావించవచ్చు.
Tags:    

Similar News