వైవీ, మేక‌పాటిల‌కు నో!... జ‌గ‌న్ వ్యూహ‌మేంటో?

Update: 2019-03-17 11:48 GMT
2019 ఎన్నిక‌ల‌కు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చాలా కీల‌క‌మైన‌విగానే ప‌రిగ‌ణిస్తున్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కొంద‌రు పార్టీ నేత‌ల అతి విశ్వాసంతో చేతికందిన అధికారాన్ని చేజార్చుకున్న జ‌గ‌న్‌... ఈ ద‌ఫా అధికార పగ్గాల‌ను చేప‌ట్టి తీరాల్సిందేన‌న్న దృఢ సంక‌ల్పంతో సాగుతుండ‌టం కూడా ఈ ఎన్నిక‌లు ఆ పార్టీకి అత్యంత కీల‌కమైన‌విగానే చెప్పుకోవాలి. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌డం, మ‌రో రెండు రోజుల్లో నోటిఫికేష‌న్ కూడా రానున్న నేపథ్యంలో నేటి ఉద‌యం సింగిల్ సిట్టింగ్ లోనే జ‌గ‌న్ త‌న పార్టీకి సంబంధించిన పూర్తి జాబితాను ప్ర‌క‌టించేశారు. ఇడుపుల‌పాయ‌లోని త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మాధి సాక్షిగా విడుద‌లైన ఈ జాబితాలో మొత్తం 175 అసెంబ్లీ సీట్ల‌తో పాటు 25 ఎంపీ స్థానాల‌కు కూడా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. సింగిల్ జాబితాలోనే మొత్తం జాబితాను ప్ర‌క‌టించేసిన జ‌గ‌న్ ధైర్యాన్ని కొన్ని వ‌ర్గాలు కొన‌యాడుతుండ‌గా... అస‌లు ఈ జాబితా ద్వారా జ‌గ‌న్ వ్యూహం ఏమిట‌న్న విష‌యంపై మ‌రోవైపు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఈ జాబితాలో ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ల‌ను జ‌గ‌న్ మార్చేశారు. వీటిలో త‌న సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఒంగోలు సీటుతో పాటు పార్టీలో కీల‌క నేత‌గా ఉన్న మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి సీటును కూడా ఇటీవలే టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరిన మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి, ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిల‌కు కేటాయించి జ‌గ‌న్ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. వైవీ సుబ్బారెడ్డి అంటే,... త‌న సొంత బాబాయి కాబ‌ట్టి ఆయ‌న‌ను ఎలాగోలా స‌ముదాయించుకోవ‌చ్చ‌నుకుంటే... మేక‌పాటిని దూరం పెట్ట‌డంలోని వ్యూహ‌మేంటో అర్థం కావ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక తిరుప‌తి స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ‌ర‌ప్ర‌సాద్ ను కూడా ఈ ద‌ఫా అక్క‌డి నుంచి త‌ప్పించి ఆ స్థానాన్ని పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చి చేరిన బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ కు కేటాయించారు. వ‌ర‌ప్ర‌సాద్ ను అసెంబ్లీ బ‌రిలో నిలిపిన జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు నెల్లూరు జిల్లా గూడూరు సీటును కేటాయించారు. ఇలా సిట్టింగ్ ఎంపీలున్న మూడు చోట్ల కొత్త వారికీ... అది కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారికి సీట్లిచ్చారు. ఇక మొత్తం 25 ఎంపీ సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన జ‌గ‌న్‌... 15 చోట్ల కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు.

కొత్త నేత‌లు బ‌రిలో ఉన్న సీట్ల విష‌యానికి వ‌స్తే.... అరకు - గొడ్డేటి మాధవి, విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి - డాక్టర్‌ సత్యవతి, అమలాపురం - చింతా అనురాధ, రాజమండ్రి - మర్గాని భరత్‌, నరసాపురం - రఘురామ కృష్ణంరాజు, ఏలూరు - కోటగిరి శ్రీధర్‌, విజయవాడ - పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ), నరసారావుపేట - లావు కృష్ణదేవ రాయలు, బాపట్ల - నందిగం సురేశ్‌, నంద్యాల - పీ బ్రహ్మానందరెడ్డి, కర్నూలు - డాక్టర్‌ సింగరి సంజీవ్‌ కుమార్‌, అనం తపురం - తలారి రంగయ్య, హిందుపురం - గోరంట్ల మాధవ్‌, చిత్తూరు - నల్లకొండగారి రెడ్డప్ప... ఇలా ఏకంగా 15 మంది కొత్త‌ అభ్య‌ర్ధుల‌ను బ‌రిలోకి దింపారు. అయినా సిట్టింగ్ ఎంపీలున్న చోట కూడా కొత్త నేత‌ల‌కు, వ‌ల‌స నేత‌ల‌కు జ‌గ‌న్ ఎందుకు అవ‌కాశం క‌ల్పించార‌న్న‌ది ఇప్పుడు ఏ ఒక్క‌రికీ అంతుచిక్క‌డం లేదు. అస‌లు దీని వెనుక ఉన్న జ‌గ‌న్ వ్యూహం ఏమిట‌న్న కోణంలో ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

   

Tags:    

Similar News