రేప్ కేసుల్లో 'టూ ఫింగ‌ర్ టెస్ట్' వ‌ద్దు: మ‌హిళ‌ల‌కు రిలీఫ్ ఇచ్చిన సుప్రీం కోర్టు

Update: 2022-10-31 10:40 GMT
అత్యాచారానికి గురైన మ‌హిళ‌లు లేదా యువ‌తులు త‌మ బాధ‌ను చెప్పుకొనేందుకు ఎంతో త‌ల్ల‌డిల్లిపోతుంటారు. స‌మాజం త‌మ‌ను ఏమంటుందో.. స‌మాజంలో త‌ల ఎత్తుకుని ఎలా బ‌త‌కాలో అని స‌గం చ‌చ్చిపోతారు. అలాంటి వారికి మ‌రింత వేద‌న‌క‌లిగించే భ‌య‌క‌ర‌మైన ప‌రీక్ష 'టూ ఫింగ‌ర్ టెస్ట్‌'. దీనిపై ఎప్ప‌టి నుంచో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతూనే ఉంది.

అత్యాచార బాధితురాలిపై అస‌లు అత్యాచారం జ‌రిగిందో లేదో తెలుసుకునేందుకు జ‌న‌నాంగంలోకి రెండు వేళ్లు చొప్పించి క‌న్య‌త్వ పొర‌ను తాక‌డ‌మే ఈ ప‌రీక్ష‌. అయితే.. తాజాగా దీనిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది.

అత్యాచార బాధితులకు నిర్వహించే 'టూ ఫింగర్ టెస్ట్'లు ఇప్పటికీ కొనసాగుతుండటం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరీక్షలను అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సమాజంలో ఇప్పటికీ ఇవి కొనసాగుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.

ఈ మేరకు.. హత్యాచారం కేసులో భాగంగా ఓ నిందితుడిని దోషిగా తేల్చుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టిన ఝార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తీర్పుచెప్పింది.

"రెండు వేళ్ల పరీక్ష అనేది మహిళల గోప్యత, గౌరవమర్యాదలకు భంగం కలిగిస్తుంది. ఇప్పటికీ ఈ పరీక్షలు కొనసాగుతుండటం దురదృష్టకరం. ఇలాంటి పరీక్షలు ఎవరు చేసినా.. దుష్ప్రవర్తన నేరం కింద పరిగణించాలి" అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల పాఠ్యాంశాల నుంచి 'రెండు వేళ్ల పరీక్ష'కు సంబంధించిన అంశాలను తొలగించాలని స్పష్టం చేసింది.

గ‌తంలో సుప్రీం కోర్టు అనుమ‌తి!దేశంలోని పలు ప్రాంతాల్లో రెండు చేతి వేళ్లను ఉపయోగించి మహిళలకు కన్యత్వ పరీక్ష జరుపుతున్నారు. 'టూ ఫింగర్ టెస్ట్‌'గా పిలిచే ఈ పరీక్షను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో అత్యాచార బాధితులను పరీక్షించడానికి వినియోగించేవారు. కానీ ఆ తర్వాత దీన్ని అశాస్త్రీయమైనదిగా భావించిన అత్యున్నత న్యాయస్థానం ఈ పరీక్షను రద్దు చేసింది. అయినా వధువుకు కన్యత్వ పరీక్ష చేయడానికి దేశంలోని కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ పాటిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News