కాఫర్ డ్యామ్ తో పోలవరానికి పంగనామాలు?

Update: 2017-12-31 07:53 GMT
పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అర్థమయిపోయింది. అందుకే ఆయన కాఫర్ డ్యాం పేరుతో కపట నాటకం సాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 50వేల కోట్లకు పైగా వ్యయం చేసి ప్రాజెక్ట్ ను పూర్తిచేసేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేకపోవడం - కేంద్ర ప్రభుత్వం మడమ తిప్పి చేతులెత్తేయటంతో కాఫర్ డ్యాంను పటిష్టంగా పూర్తిచేసి దానినే పోలవరంగా వినియోగంలోకి తెచ్చేందుకు ఆయన వ్యూహం పన్నినట్లు కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సాగుతున్న ప్రశాంత యుద్ధం పరిశీలిస్తే - కాఫర్ డ్యాం కోసం సీఎం పట్టుబడుతున్న తీరు అందుకు అద్దం పడుతున్నాయి. తాజాగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సగం రాజీ తరహాలో కాఫర్ డ్యాం నిర్మాణం సాగించే విషయంలో అవగాహన వస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిని 42.5 మీటర్ల ఎత్తులో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెరమీదకు తీసుకురాగా అందుకు ప్రత్యామ్నాయంగా ఎత్తు తగ్గించి నిర్మించే విధంగా డిజైన్ లో మార్పులను ఎన్ హెచ్ పీసీ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) ఆమోదం తెలిపింది.

పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం పేరుతో మరోసారి ఆంధ్రప్రదేశ్ కు దగా - ద్రోహం చేసేందుకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇంతవరకూ జలాశయా నిర్మాణా చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కాఫర్ డ్యాం నిర్మించి దాని ద్వారా పోలవరం మొదటిదశ పూర్తయినట్లు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపన్నుతున్నారు.

మొత్తానికి రెండు ప్రభుత్వాలు కలిపి రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా రైతాంగాన్ని తీవ్రంగా మోసగించేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నాయి. అదే కాఫర్ డ్యాం... బాబుగారు అమ్ములపొదిలో ఇది మరో అస్త్రంగా చేరింది. ఆయన కంప్యూటర్ కనిపెట్టినట్టు - సుందర్ పిచాయ్ - సత్య నాదెళ్ల తదితరులను తయారుచేసినట్టు - ఎన్టీరామారావుతో పార్టీ పెట్టించినట్లు - చంద్రబాబుకు ప్రధానమంత్రి పదవికి వద్దని.. ముఖ్యమంత్రిగానే కొనసాగమంటూ తన తనయుడు లోకేష్ చెప్పినట్టుగానే... ఇప్పుడు తాజాగా పోలవరానికి ప్రత్యామ్నాయంగా కాఫర్డ్యాంను కనిపెట్టేశారు. ఇంకేముంది ఇంజనీర్ లంతా ఆయన ముందు వేస్టయిపోయారు. ఏపి ఇంజనీర్లు విధిలేక దీనిని పోలవరానికి ప్రత్యామ్నాయంగా 42.5 మీటర్లతో తొలి ఒప్పందానికి విరుద్ధంగా రూపొందించారు. ఈ విధంగా కాఫర్ డ్యాంను ఎత్తు పెంచి నిర్మించేందుకు అనుమతించాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటానికి కారణం లేకపోలేదు. పోలవరానికి మంగళం పాడేందుకే కాఫర్ డ్యాం ఎత్తు పెంచే కుట్ర రంగంలోకి వచ్చింది.

2018 నాటికి డయాఫ్రం వాల్ నిర్మించి పోలవరం మొదటిదశ పూర్తి చేస్తామని బాబుగారు ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు. కానీ అది పూర్తయ్యే పరిస్థితి లేదు. దాంతో ఇప్పుడు కాఫర్ డ్యాంనే (అంటే జలాశయ నిర్మాణానికి నీరు అడ్డు రాకుండా నిర్మించే మట్టికట్ట) పోలవరం మొదటిదశగా చెప్పుకుని రాజకీయ లబ్ది కోసం కాంట్రాక్టర్ ప్రయోజనాల కోసం ఇప్పటి నుంచే ‘స్కెచ్’ వేసేశారు.

అసు కాఫర్ డ్యాం అనేది ప్రధాన జలాశయంలో నిర్మాణ పనులు జరిగేటప్పుడు నీరు అడ్డురాకుండా నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణం మాత్రమే. ఇది ఏమాత్రమూ పటిష్టంగానూ - స్థిరంగానూ ఉండదు. శాశ్వతంగా అసలు ఉపయోగపడదు. అటువంటి తాత్కాలిక నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడ నిల్వ ఉండే నీటిని చూపించి మొదటిదశ పూర్తయిందనిపించుకునేందుకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల అదనపు భారం కావడంతోపాటు కాంట్రాక్టర్ కు మాత్రం లబ్ది చేకూరుతుంది.

సాధారణంగా ప్రతి జలాశయ నిర్మాణ దశలోనూ కాఫర్ డ్యాం అనివార్యం. కానీ పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. పోలవరం కాఫర్ డ్యాంను 60 టిఎంసీల నీటిని నిల్వ చేసే విధంగా నిర్మించి రెండు కాలువలకూ నీరందించడమే సాధ్యమైతే ఇక తొలినుంచీ సిపిఎం - తెలంగాణలోని టిఆర్ ఎస్ తదితర రాజకీయ పార్టీలు చేస్తున్న వాదన కూడా అదే! అటువంటప్పుడు పోలవరం ప్రాజెక్టే అవసరం ఉండదు. కాపర్ డ్యాం స్థాయిలోనే పోలవరం డ్యాంను నిర్మించి అసలు పోలవరం ప్రాజెక్టే అవసరం లేదనే వాదన కూడా ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చే కుట్ర కూడా ఇందులో కనిపిస్తోంది.

కాఫర్ డ్యాం ద్వారా 60 టిఎంసీల నీటిని నిల్వ చేసేందుకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపిందని కొత్త వాదన కొంత కాలం క్రితం ముందుకు తీసుకువచ్చారు. దీనికి ఇంజనీరింగ్ అధికారులు నివ్వెరపోతున్నారు. అంత నీటిని నిల్వ చేస్తే ఆ ఒత్తిడికి కాఫర్ డ్యాం కొట్టుకుపోతుంది. ఈ విధమైన నిర్మాణం నీటి ప్రవాహాన్ని మళ్లించడానికి ఉపయోగపడుతుందే తప్ప నీటిని నిల్వ చేయడానికి మాత్రం కాదు. పైగా సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఈ ఆలోచన వినిపించారు. (బుధవారం - 2016 సెప్టెంబరు 14 ఈనాడు హైదరాబాద్ 9వ పేజీ) ఇది చదివితే అసలు బాబుగారి ముందు ఇంజనీర్లు దిగదుడుపు. ఇక ఆయన కంప్యూటర్లు కనిపెట్టినట్లే - రామారావును రాజకీయాలకు పరిచయం చేసినట్లే ఇది కూడా! అయితే వాస్తవానికి కేంద్ర జలసంఘం అందుకు అంగీకరించలేదు.

కాఫర్ డ్యాం వల్ల అంత నీరు నిల్వ ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఈ నిర్మాణానికే అంత నీటి నిల్వ సాధ్యమైతే పులిచింతల - కాటన్ బ్యారేజి - ప్రకాశం బ్యారేజీ వంటి వాటికి బదు కాపర్ డ్యాంలే నిర్మించి అక్కడ ఇప్పుడు నిల్వ చేస్తున్న నీటి కన్నా ఎక్కువ నీటిని నిల్వ చేయవచ్చు కదా! కాఫర్ డ్యాం నిర్మించి కుడి ఎడమ కాలువకు నీరందించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అక్కడ మళ్లీ పంపులను ఏర్పాటు చేయాలి. 6 మీటర్ల హెడ్ ఉంటుంది కాబట్టి గురుత్వాకర్షణ ద్వారా నీటి ప్రవాహం సాధ్యమవుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఇది సాధ్యం కాదు. అందులోనూ వరద కాలువకు అసలు వీలుపడదు. మళ్లీ పంపు హౌసులే ఏర్పాటు చేయాలి.

పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. ట్రాన్స్ ట్రాయ్ నిర్మాణ సంస్థ పూర్తిగా వివాదాల్లో చిక్కుకుపోయింది. సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటం లేదని విమర్శలు ఉన్నాయి. తాజాగా కెనరా బ్యాంకు ట్రాన్స్ ట్రాయ్ పై దివాళా పిటీషన్ను ఎన్ ఎల్సీటిలో దాఖలు చేసింది. ప్రాజెక్ట్లో ప్రధానమైన నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభం కానేలేదు. ప్రాజెక్ట్ కు సంబంధించి మరింత గందరగోళం సృష్టించే విధంగా కమిటీలు వచ్చి పరిశీలించి వెళుతున్నాయి. ఈ దశలో కాఫర్ డ్యాం వివాదామే పరిష్కారం కాలేదు. ఇక ఆ పనిని పూర్తిచేసి పోలవరం పూర్తయిందనిపించే ముఖ్యమంత్రి  ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయి?

-    ఎస్.వి.రావు

Tags:    

Similar News