గడ్కరీ భజనతో ఏం సాధించినట్టు?

Update: 2017-11-12 17:30 GMT
చంద్రబాబు నాయుడుకు పొగడ్తలు అంటే చాలా మక్కువ అనిపిస్తుంది. మీడియాతో పొగిడించుకోవడం ద్వారా ప్రజల్లో ఇమేజీ సృష్టించుకోవడం ఎలాగో చంద్రబాబుకు తెలుసు. రాజకీయంగా తన మనుగడకు ఆ పొగడ్తలు ఎలా పునాదులు వేస్తాయో ఆయనకు తెలుసు. అలాగే.. తాను పొగిడి.. ఇతరులతో పనులు సాధించుకోవచ్చునని కూడా ఆయన అనుకుంటూ ఉంటారేమో. కానీ ఫలితాలు మాత్రం అంత సవ్యంగా ఉండడం లేదు. ఎందుకంటే.. మోడీని పొగిడి సాధించింది ఇప్పటిదాకా ఏమీలేదు. అమరావతి లో ఆ నడుమ ఓ శంకుస్థాపన పేరిట జైట్లీని పిలిచి, పొగిడి సాధించింది ఏమీ లేదు. పోలవరం చూడడానికి గడ్కరీని ఆహ్వానించి, కీర్తించి సాధించింది కూడా ఏమీ లేదు. ఆ రోజున జరిగిన సభను గుర్తుచేసుకుంటే.. గడ్కరీని  చంద్రబాబు - చంద్రబాబును గడ్కరీ తెగ పొగిడేసుకున్నారు. తీరా పోలవరం మాత్రం ఇవాళ ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

గడ్కరీని పొగడడం మాత్రమే కాదు. పోలవరానికి కొత్త టెండర్ల విషయంలో ఆయన హ్యాండిచ్చాడని సంకేతాలు వచ్చినప్పుడు హుటాహుటిన నాగపూర్ వెళ్లి అక్కడ కూడా ఆయనను ఒప్పించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అమెరికా వెళ్లే హడావుడిలో కూడా రాష్ట్రం కోసం నాగపూర్ వెళ్లి చాలా కష్టపడి అక్కడినుంచి అమెరికా వెళ్లానంటూ ఆయన చెప్పుకున్నారు.

ఆయన కష్టపడ్డాడు సరే.. దాని ఫలితం మాత్రం సున్నా. గడ్కరీని ఎంతగా కీర్తించినా.. ఇవాళ పోలవరానికి దక్కవలసిన దానికంటె తక్కువే దక్కింది. పనులే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే చంద్రబాబునాయుడు తాను లౌక్యం పాటిస్తున్నానని అనుకుంటున్నారేమో గానీ.. కేంద్రం గురించి ఒక్క మాట ఆగ్రహించకుండా, వారిని కనీసం ఒక్కసారైనా గట్టిగా డిమాండ్ చేయకుండా నానుస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు తీరును ప్రజలు మాత్రం.. భయపడుతున్నట్లుగా భావిస్తున్నారు. మరి కేంద్రానికి చంద్రబాబు తన రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ.. ఇంతగా ఎందుకు భయపడుతున్నట్లు? ఆ రహస్యం ఏమిటో ఆయనకే తెలియాలి.
Tags:    

Similar News