బీజేపీ: ప్ర‌త్యేకంతో ఏపీకేం ఉప‌యోగం లేదు

Update: 2015-10-24 14:11 GMT
యావ‌త్ ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానికం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తున్నారు. హోదా ప్ర‌క‌ట‌న కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార బీజేపీపై గంపెడాశ‌లు పెట్టుకుంటే ఆ పార్టీ వీలైనంత‌గా ఈ ప్ర‌క్రియ‌పై వెన‌క‌డుగు వేస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి సుదీశ్ రాంబొట్ల కీల‌క‌మైన కామెంట్లు చేశారు.

ఆంధ్రప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఎటువంటి ఉపయోగం లేద‌ని ఆయ‌న తేల్చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి ఎటువంటి ప్రయోజనం లేదనీ, అంతకంటే మెరుగైన ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ విష‌యాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు విస్పష్టంగా చెప్పారని సుధేష్ రాంభోట్ల అన్నారు. ఈ దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేయ‌డాన్ని ఏపీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తోంద‌ని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ స‌హా ఇత‌ర ప‌క్షాలు ఆందోళన విరమించి రాష్ట్ర పురోగతిని సహకరించాలని ఆయన కోరారు.

ఇంత‌కీ స్పెష‌ల్ స్టేట‌స్‌పై వెన‌క్కుపోతున్నాం అని చెప్తున్న బీజేపీ ప్ర‌త్యేక ప్యాకేజీ హామీని అయినా నిల‌బెట్టుకుంటుందా అని ఇపుడు కొత్త చ‌ర్చ‌కు తెర‌లేస్తోంది. బీజేపీ నాయ‌కులు రాజకీయ‌ వేడిని త‌గ్గించేందుకే కొత్త కొత్త స్టేట్‌మెంట్లు ఇస్తున్నారా లేదా కేంద్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌రున్న స‌మాచారాన్ని స్ప‌ష్టంగా చెప్తున్నారా అనేది కాలం తేలుస్తుంది.
Tags:    

Similar News