ఉత్త‌రాంధ్ర : ఉద్యమాల నేల‌పై మాట్లాడే గొంతుక‌లే లేవా ?

Update: 2022-08-14 12:30 GMT
పంద్రాగ‌స్టు వేళ జాతిని న‌డిపిన వారిని త‌ల్చుకుంటుంటారు. బాగుంది అది బాధ్య‌త కూడా ! మా కొద్దీ తెల్ల‌దొర‌త‌నం అని పాడి వినిపించిన గ‌రిమెళ్ల స‌త్య‌నారాయ‌ణ‌ను, ఇంకా ఇంకొంద‌రిని స్మ‌రించుకుంటాం. శ్రీ‌కాకుళం జిల్లాకు మ‌హాత్ముడు వ‌చ్చాడంటూ దూసి స్టేష‌న్ కు పోయి నాటి రోజుల గురించి తెలుసుకుంటాం. ఇవ‌న్నీ బాగున్నాయి గౌతు ల‌చ్చ‌న్న లాంటి వారు లేదా ఇంకా ఇంకొంద‌రు దేశానికి సేవ చేసి చ‌రితార్థులు అయ్యార‌ని గ‌ర్విస్తాం. ఇవ‌న్నీ బాగున్నాయి కానీ వ‌ర్త‌మాన స‌మాజంలో శ్రీ‌కాకుళం జిల్లా హ‌క్కుల కోసం, ఇక్క‌డి ప్రాంత ప్ర‌జ‌ల బాగు కోసం కృషి చేసే నేత‌లెవ్వ‌రు అన్న‌దే ఓ ప్ర‌ధానం అయిన ప్ర‌శ్న.

ఉద్దానంలో ఒక‌ప్పుడు  శివాజీ ప‌నిచేసినా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. వివ‌దాల్లో ఇరుక్కుపోయారు. యోధుల కుటుంబం నుంచి వ‌చ్చినా కూడా ఆయ‌న యోధుడు కాలేక‌పోయారు. కాస్తో కూస్తో ఢిల్లీ వ‌ర‌కూ వెళ్లి శ్రీ‌కాకుళం గొంతుక వినిపించిన ఎర్ర‌న్నాయుడు కూడా జిల్లా స‌మ‌గ్ర ప్ర‌గ‌తిలో పెద్ద‌గా మార్పేమీ తీసుకుని రాలేకపోయారు. ఉన్నంత‌లో కొన్ని గ్రామీణ ర‌హ‌దారులను, ఉద్దానం వారికి పైలెట్ వాట‌ర్ స్కీంను త‌ప్ప ఇంకా ఏ ఇత‌ర ప‌నులూ చెప్పుకోద‌గ్గ రీతిలో చేయ‌లేక‌పోయారు అన్న విమ‌ర్శ కూడా ఉంది.

జిల్లా నుంచి ప‌నిచేసిన ప్ర‌తిభా భార‌తి (స్పీక‌ర్ గా ప‌నిచేశారు) ఆమె కూడా పెద్ద‌గా ఎచ్చెర్ల నియోజక‌వ‌ర్గానికి చేసిందేం లేదు. ఆ విధంగా చూసుకుంటే ఆమె వార‌సురాలిగా వ‌స్తున్న కావలి గ్రీష్మ రేప‌టి వేళ ఏ విధంగా రాణిస్తారో మరి! ఒక‌నాటి నాయ‌కుల‌కు ఉన్న ప‌టిమ, స‌మ‌ర్థ‌త అన్న‌వి ఇప్ప‌టి నాయ‌కులకు లేవు గాక లేవు అన్న‌వి తేలిపోయింది.

ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చినా అవ‌న్నీ స్వార్థ రాజ‌కీయాల్లో భాగంగా  వ‌చ్చేయి.  జిల్లాను దోపిడీ చేసిన ట్రైమాక్స్ లాంటి కంపెనీలు ఇక‌పై వ‌ద్దు గాక వ‌ద్దు అన్న మాట‌లే వినిపించినా కొన్ని లోక‌ల్ మీడియాలు వాటికే వ‌త్తాసు ప‌లికి కాసులను దండుకున్నాయి. క‌నుక అప్ప‌టిలా దిగ్గజ నేత‌లు ఎవ్వ‌రూ లేరు.

 ఎవ‌రి దారి వారు చూసుకుని రేప‌టి గురించి ఇవాళే దీపం  ఉండ‌గానే త‌మ వెలుగు స్థిరం చేసుకునే వారే త‌ప్పఇవాళ జిల్లా కోసం ప్రాణ త్యాగాలు ఇచ్చే నేత‌లు లేరు. అవ‌న్నీ త‌ప్పులు శుద్ధ అబ‌ద్దాలు కూడా ! అందుకే మ‌న్యం కూడా ప్ర‌గ‌తిని పొంద లేకపోతోంది. ఆశించిన ప్ర‌గ‌తి లేని రోజున మ‌న్యం కోసం ఏం చెప్పినా అది త‌ప్పే (ఇప్పుడంటే అది వేరొక జిల్లా కావొచ్చు)కానీ ఒక‌ప్పుడు నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ అది ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లానే. పాల‌కొండ, పాత‌ప‌ట్నం, మెళియాపుట్టి లాంటి ఏజెన్సీ ఏరియాల‌కు అభివృద్ధే లేదు. ఎందుకంటే ఎంచుకున్న ఎమ్మెల్యేలు ఎవ్వ‌రూ స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో ప‌నిచేయ‌డం లేదు క‌నుక !

ఇవాళ దిగ్గ‌జ నేత‌ల రాక‌ను మ‌నం ఊహించ‌లేం. కానీ ఉన్నంత లో బాగా ప‌నిచేసేందుకు ప‌రిత‌పించే వారెవ్వ‌ర‌యినా ఉన్నారేమో  వెత‌కాలి. త‌మ స్వార్థ‌మే ముఖ్యం అనుకునే మ‌నుషుల ద‌గ్గర మ‌నం గొప్ప ఫ‌లితాలు పొంద‌లేం. ఆ విధంగా జిల్లాకు పెనుశాపం కుల రాజ‌కీయాలే త‌ప్ప మ‌రొక‌టి కాదు. ఆ విధంగా రెండు సామాజిక వ‌ర్గాల ప్రాబ‌ల్యంలో జిల్లా ఎటువంటి పురోగ‌తీ పొంద‌లేక అవ‌స్థ‌లు ప‌డుతోంది.
Tags:    

Similar News