స్వామి ట్వీట్స్‌!... బీజేపీ నేత‌ల‌కు కొత్త నియ‌మావ‌ళి!

Update: 2017-12-26 11:32 GMT
సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి... పేరు విన‌గానే ఠ‌క్కున మ‌న మ‌దిలో ఆ బీజేపీ సీనియర్, రాజ్య‌స‌భ స‌భ్యుడి మోము మెదులుతుంది. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంగా వ్య‌వ‌హ‌రించే సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి త‌మిళ‌నాడుకు చెందిన ఫైర్ బ్రాండ్‌. అస‌లు స్వామి ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో అంచ‌నా వేయడం అంత ఈజీ కాదు. స్వామి మీడియా ముందుకు వ‌స్తున్నారంటే... మీడియా ప్ర‌తినిధులంతా త‌మ బుర్ర‌ల‌కు ప‌దును పెట్టాల్సిందే. ఎందుకంటే... స్వామి ఏ విష‌యంపై మాట్లాడ‌తారో తెలియ‌దు క‌దా. మొత్తంగా స్వామిని ఓ స్పెష‌లిస్ట్ పొలిటీషియ‌న్‌ గా చెప్పుకోవాల్సిందే. విప‌క్షాల‌కు చెందిన నేత‌ల‌పై ఎంతగా ఆయ‌న ఫైర్ అవుతారో, ఆ మ‌రుక్ష‌ణ‌మే స్వ‌ప‌క్షం నేత‌ల‌పైనా ఆయ‌న మ‌రింత‌గా విరుచుకుప‌డ‌తారు కూడా.

అయినా ఇప్పుడిదంతా ఎందుక‌న్న విష‌యానికి వ‌స్తే... త‌న మ‌దిలో మెదిలిన విష‌యాన్ని సూటిగా సుత్తి లేకుండా, ఏమాత్రం మొహ‌మాటం లేకుండా కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్లుగా చెప్పేసే మ‌న‌స్త‌త్వమున్న నేతగా స్వామి... ఇప్పుడు త‌న సొంత పార్టీ నేత‌ల‌తో పాటు కేంద్ర కేబినెట్‌లోని మంత్రుల‌కు ఓ ప్ర‌త్యేక నియ‌మావ‌ళిని అమ‌లు చేయాలంటూ కొత్త రాగం అందుకున్నారు. నేటి ఉద‌యం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న చేసిన వ‌రుస ట్వీట్లు నిజంగా బీజేపీ నేత‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసి ఉంటాయ‌ని చెప్పాలి. అయినా ఆ ట్వీట్ల‌లో స్వామి ఏ అంశాల‌ను ప్ర‌స్తావించార‌న్న విష‌యానికి వ‌స్తే... పాశ్చాత్య దుస్తుల‌ను (వెస్ట్ర‌న్ క‌లెక్షన్స్‌) ఆయ‌న *బ‌ల‌వంతంగా రుద్దిన బానిస‌త్వం*గా అభివ‌ర్ణించేశారు.

ఇలాంటి బానిస‌త్వం నుంచి ముందుగా మంత్రుల‌ను బ‌య‌ట‌ప‌డేయాల‌ని సూచించిన స్వామి... కేటినెట్‌లోని బీజేపీ మంత్రులంతా పాశ్చాత్య దుస్తులు ధ‌రించ‌కుండా నిషేధం విధించాల‌ని పేర్కొన్నారు. వస్త్రధారణను పార్టీ క్రమశిక్షణ అంశంగా తీసుకుని... దేశ వాతావరణానికి అనుగుణమైన దుస్తులు మాత్రమే ధరించేలా బీజేపీ చూడాలన్నారు. ఇక మ‌ద్యపానంపైనా త‌న‌దైన శైలిలో స్పందించిన స్వామి... ఆల్కహాల్ డ్రింక్‌ లపై నిషేధాన్ని సూచిస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 49 పేర్కొనడాన్ని ప్రస్తావించారు. పార్టీ క్రమశిక్షణలో భాగంగా పార్టీలోని వారెవరూ మద్యం తీసుకోకుండా నిషేధం విధించాలని కూడా స్వామి సూచించారు. మ‌రి స్వామి సూచ‌న‌ల‌పై అటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఇటు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News