జూపూడికి నామినేటెడ్ పోస్ట్‌.. ఎమ్మెల్సీ లేన‌ట్టేనా?

Update: 2021-07-18 00:30 GMT
ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మేధావి, రాజ‌కీయ నేత‌గా మంచి గుర్తింపు ఉన్న జూపూడి ప్ర‌భాక‌ర్‌కు సీఎం జ‌గ‌న్ నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. రాష్ట్ర‌  సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్‌రావు ను జ‌గ‌న్ నియ‌మించారు. ఇది ఒక ర‌కంగా మంచి ప‌ద‌వే అయిన‌ప్ప‌టికీ.. జూపూడి ఆశించిన ప‌ద‌వి మాత్రం కాద‌ని.. ఆయ‌న అనుకూల వ‌ర్గం నుంచి గుసగుస వినిపిస్తోంది. నిజానికి వైసీపీ త‌ర‌ఫున ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త విభేదాల‌తో ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. రాష్ట్రంలో చంద్ర‌బాబు స‌ర్కారు రావ‌డంతో టీడీపీకి జైకొట్టారు.

ఈ క్ర‌మంలోనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చి .. చంద్ర‌బాబు గౌర‌వించారు. కానీ, అప్ప‌ట్లోనూ ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం ఎంతో ప్ర‌య‌త్నించారు. కానీ, అప్ప‌టికే నేత‌లు ఎక్కువ‌గా ఉండ‌డంతో చంద్ర‌బాబు.. జూపూడి అభ్య‌ర్థ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ మ‌రోసారి చంద్ర‌బాబును మ‌చ్చిక చేసుకుని ఎమ్మెల్యే టికెట్ కోసం ప్ర‌య‌త్నించారు. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి పోటీ చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. అయితే.. అప్ప‌టికే పార్టీలోకి వ‌చ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌కు చంద్ర‌బాబు ఆ టికెట్‌ను ఇవ్వ‌డంతో జూపూడి ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో.. జూపూడి.. మ‌రోసారి పార్టీ మారి వైసీపీలోకి వ‌చ్చారు. ఇప్ప‌టికే రెండేళ్లుగా ఆయ‌న ప‌ద‌వి కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వైవీ వ‌ర్గంలో నాయ‌కుడిగా చ‌లామ‌ణి అవుతున్న జూపూడికి.. ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని.. ఎస్సీ వ‌ర్గంలో పార్టీకి మంచి పేరు వ‌స్తుంద‌ని.. వైవీ స‌హా ప‌లువురు సూచించిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు సైతం వ‌చ్చాయి. అయితే.. ఇప్ప‌టికే లెక్కకు మిక్కిలిగా సొంత నేత‌లే ఎమ్మెల్సీ ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. అనూహ్యంగా జూపూడికి.. సామాజిక న్యాయ సలహాదారు ప‌ద‌వి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇది గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ద‌వే అయిన‌ప్ప‌టికీ.. .జూపూడి ఆశ‌లు మాత్రం నెర‌వేరేలా లేవ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, వ‌చ్చే రెండేళ్లు ఈయ‌న ఈప‌దవికే ప‌రిమితం కావాల్సి ఉంటుంది.
Tags:    

Similar News