ఎంపీ అరవింద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్

Update: 2022-03-24 13:34 GMT
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తాజాగా నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. అరవింద్ పై దాఖలైన కేసుల్లో విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆ వారెంట్ జారీ చేసింది. గతంలో జరిగిన కేసుల విచారణకు అరవింద్ గైర్హాజరు కావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఫిర్యాదు ప్రకారం కేసు నమోదైంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా 2020 నవంబర్ 23న కేబీఆర్ పార్క్ వద్ద టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను అరవింద్, ఆయన అనుచరులు తొలగించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, కేసీఆర్, కేటీఆర్ లను అరవింద్ దుర్భాషలాడారని కేసు నమోదైంది.
పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. అయిన్నప్పటికీ అరవింద్ ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో, అరవింద్ కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి బీజం వేసిన సంగతి తెలిసిందే. ఆ విజయం ఇచ్చిన ఊపుతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరింత దూకుడుతో వ్యవహరించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని రెండో అతి పెద్ద పార్టీగా నిలబెట్టారు. బల్దియా వార్ సమయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు పోటీ తామేనని చెప్పిన సంజయ్, అరవింద్ లు...2023లో తెలంగాణలో బీజేపీదే అధికారమని చాలాసార్లు చెప్పారు. ఈ క్రమంలోనే సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇరకాటంలో పడేశాయి. మరి, ఈ వ్యవహారపై సంజయ్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News