జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌.. కేసు ఇదే!

Update: 2022-12-22 09:38 GMT
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఉత్తరప్రదేశ్‌ లోని రాంపూర్‌ ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన లకు సంబంధించి ఆమెపై నమోదైన కేసుల విషయంలో విచారణకు హాజరు కాకపోవడంతో నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వచ్చే విచారణకు జయప్రద స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కాగా 1996 టీడీపీ అనుబంధ విభాగం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా జయప్రద పనిచేశారు. అంతేకాకుండా టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా సైతం పనిచేశారు. ఆ తర్వాత ఆమె సమాజ్‌ వాదీ పార్టీలో చేరారు. నాటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌ సింగ్‌ తో సన్నిహితంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ లోని రాంపూర్‌ నుంచి వరుసగా రెండుసార్లు 2004, 2009ల్లో ఎంపీగా సమాజ్‌ వాదీ పార్టీ నుంచి జయప్రద గెలుపొందారు.

ఆ తర్వాత సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్, రాంపూర్‌ సమాజ్‌ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ తో వచ్చిన విభేదాలతో సమాజ్‌ వాదీ పార్టీకి రాజీనామా చేశారు. అమర్‌ సింగ్‌ తో కలిసి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ అసలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆ పార్టీని రాష్ట్రీయ లోక్‌దళ్‌ లో విలీనం చేశారు. ఆర్‌ఎల్‌డీ తరఫున ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్‌ నుంచి 2014లో ఎంపీగా పోటీ చేసి జయప్రద ఓడిపోయారు.

తర్వాత అమర్‌ సింగ్‌ కన్నుమూయడంతో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలోనే కొనసాగుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్‌ నుంచి పోటీ చేసి ఆజమ్‌ ఖాన్‌ చేతిలో లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లంఘన కేసులకు సంబంధించి జయప్రదపై వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెకు వారెంట్‌ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది అమర్‌నాథ్‌ తివారీ తెలిపారు.

ఈ కేసుల విచారణ సమయంలో జయప్రద వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడం రాంపూర్‌ ప్రత్యేక కోర్టు ఆమె తీరుపై ఆగ్రం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే జయప్రదపై తాజాగా రాంపూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. అంతేకాదు డిసెంబర్‌ 27 విచారణ సందర్భంగా జయప్రదని కోర్టులో హజరుపరచాలని రాంపూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసును కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News